3 September, 2026 | 12:28 AM

మ్యూల్ ఖాతాల మాయాజాలం

19-05-2024 | 01:58am

 సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు

సమకూరుస్తున్న ఐదుగురి అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఐదుగురు నిందితులను హైదరాబాద్ సిటీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆరీఫ్ సైఫీ అనే వ్యక్తి సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆరీఫ్‌కి యూపీకి చెందిన జైథ్, పంజాబ్‌కి చెందిన సందీప్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. తాము క్రిప్టో కరెన్సీ బిజినెస్ చేస్తున్నామని ఇండియాలో ఉన్న కొందరి బ్యాంకు ఖాతాలు కావాలని అడిగారు.

ఇందుకోసం ఒక్కో ఖాతాకి రూ. 15 వేలు చెల్లిస్తామని చెప్పారు. దీంతో ఆరీఫ్ సైఫీ తనకు తెలిసిన వారితో బ్యాంకు ఖాతాలు సమకూర్చి, మొత్తం 82 మ్యూల్ బ్యాంకు ఖాతాలు వారికి అందజేయడంతో వీటితో సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ఈ బ్యాంక్ ఖాతాల ద్వారా సైబర్ క్రైమ్ నిందితులు ఇప్పటివరకు రూ.5 కోట్ల వరకు లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆరీఫ్ సైఫీ(40), మహ్మద్ అబ్దుల్ నవీద్(30), సోహెల్ ఖాన్(20), మహ్మద్ దాదే ఖాన్(21), సోహెల్ ఖాన్(25)లను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి 65 బ్యాంక్ అకౌంట్స్ కిట్స్, 14 డెబిట్ కార్డులు, 31 సిమ్ కార్డులు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.