16 June, 2026 | 1:41 AM

కొనుగోలు సరే.. మరి అవినీతి సంగతేంటి..?

16-06-2026 12:33 AM

బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి, జూన్ 15 (విజయక్రాంతి): ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు సరే కానీ జిల్లాలో జరిగిన అవినీతి, అక్రమాల సంగతి ఏంటని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిఎస్‌ఓ కాశీ విశ్వనాథ్ గారిని ప్రశ్నించారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో సివిల్ సప్లయ్ శాఖలో జరుగుతున్న అవకతవకలపై ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... జిల్లాలో ధాన్యం కొనుగోలు, అవకతవకలు, అక్రమాల గురించి బహిర్గతం చేయకుండా డిఎస్‌ఓ తాను సుద్దపూసనని మీడియా సమావేశంలో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, ప్రభుత్వం తరఫున రైతులకు చెల్లించిన డబ్బుల గురించి చెప్పడం సరే, కానీ ఈ వివరాలు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ వివరించి ఉంటే జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండేదని అన్నారు.జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టరును కాదని డీఎస్‌ఓ ధాన్యం కొనుగోలు వివరాలు వెల్లడించడం దేనికి సంకేతం అని, జిల్లాలో కలెక్టర్ ఉన్నారా? లేక డీఎస్‌ఓనే కలెక్టరుగా వ్యవహరిస్తున్నారా? అని నిలదీశారు. మిల్లులకు అనుమతులు ఇవ్వడం, మిల్ కోడ్ ఇవ్వడం, బిజీ ప్రకారం ధాన్యం కేటాయించడం, ట్యాగింగ్ చేయడం వంటి విధులు డిఎస్‌ఓ పరిధిలో ఉంటాయని, గన్ని బ్యాగుల పంపిణీ, ట్రాన్స్పోర్ట్ ప్రక్రియ, పేమెంట్ చేయడం వంటి పనులు డిఎం చేయాల్సి ఉంటుందన్నారు.

అలా కాకుండా సర్వం తానే అనే విధంగా అదనపు కలెక్టర్, డిఎం లేకుండా మీడియా సమావేశం ఎలా నిర్వహించారని నిలదీశారు. డిఎస్‌ఓ కాశీ విశ్వనాథ్ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వనపర్తి జిల్లాను, జిల్లా ప్రజలను కించపరిచే విధంగా వరస్ట్ వనపర్తి అని సంబోధించడాన్ని బీసీ పొలిటికల్ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, పట్టణ అధ్యక్షుడు దేవర శివ, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, కృష్ణ ప్రసాద్, రామన్ గౌడ్, రాము తదితరులు పాల్గొన్నారు.