16 June, 2026 | 1:41 AM

ప్రజలకు మరింత చేరువ

16-06-2026 12:35 AM
  1. క్షేత్రస్థాయికి వెళ్లని అధికారులను ఊపేక్షించొద్దు 
  2. ఉద్యోగులందరికీ ఇదే అటెండన్స్ విధానం పాటించాలి 
  3. 99 రోజుల ప్రజాపాలనపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూన్15 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభు త్వం మార్చి 16 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లని అధికారులను ఊపేక్షించొ ద్దని, ఉద్యోగులందరికీ ఇదే అటెండన్స్ విధానం పాటిం చాలన్నారు. నియోజకవర్గాల వారీగా ‘నేనిచ్చిన ..హామీల పురోగతి’పై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికా రులను ఆదేశించారు.

99 రోజుల పాటు రాష్ట్రమంతటా జరిగిన కార్యక్రమాలపై సోమవారం సచివాలయంలో ముఖ్య మంత్రి సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా వచ్చిన ఫలితాలను సీఎం అడిగి తెలుసు కున్నారు. ఈ సమావేశానికి ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రితోపాటు వివిధశాఖల ఉన్నతాధికారులు హాజర య్యారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలు తాము జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు చేపట్టిన కార్యక్రమాల వివరాల నివేదికలను సమర్పించాయి. 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో చురుగ్గా పాల్గొన్న విభాగాలను ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు.

ప్రధాన కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రతినెలా క్షేత్రస్థాయికి వెళ్లాలని గతం లోనే ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని అధికారులు, జిల్లా కలెక్టర్లపై తనకు నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని సీఎం ఆదేశించారు. వారిపై క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలు ఎందుకు తీసుకో కూడదో.. వెంటనే వివరణ కోరాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని అధికారులను ఉపేక్షించవద్దని హెచ్చరించారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమా లను కొన్ని విభాగాలు ఆశించినంతగా చెప్పుకోలేకపో యాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను నమో దు చేయాలని, గ్రామాల్లో వచ్చిన సమస్యలను కూడా ఆయా శాఖలు పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ఈ మూడు నెలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, చేసిన శంకు స్థాపనలు, ఆస్తుల వివరాలన్నీ నమోదు చేయాలన్నారు. అన్ని పాఠశాలల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని విద్యా, వైద్య విభాగాల్లో ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలుచేయాలన్నారు. ఉద్యోగులం దరికీ ఇదే అటెండన్స్ విధానం పాటించాలన్నారు. జిల్లాల వారీగా కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై వెంటనే సమీక్ష జరపాలని సీఎం ఆదేశించారు.