28-01-2026 12:00:00 AM
ముకరంపుర, జనవరి 27 (విజయ క్రాంతి): నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ బస్ స్టేషన్ ఆవరణలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర క్యాంపును మంగళవారం కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి రాజు ప్రారంభించారు. మొట్టమొదటి బస్సును జెండా వూపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ కరీంనగర్ రీజియన్ లో 6 ఆపరేటింగ్ పాయింట్ల నుండి ప్రత్యేక బస్సులు నడుపబడుచున్నాయని, అందులో భాగంగా కరీంనగర్ ఆపరేటింగ్ పాయింటు నుండి బస్సులు ప్రారంభించబడ్డాయని తెలిపారు.
ఈ బస్సులలో మహాలక్ష్మి పథకము వర్తిస్తుందని, మహిళా ప్రయాణీకులు ఇట్టి అవకాశమును వినియోగించుకోవాలని కోరారు. ఆర్టీసీ బస్సులు గద్దెలకు దగ్గరగా వెళతాయని, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమములో డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్ భూపతిరెడ్డి, పి మల్లేశం, కరీంనగర్ - 1 డిపో మేనేజర్ ఐ విజయమాధురి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్ మల్లేశం, సూపర్వైజర్లు హిమబిందు, తిరుపతి, విజయలక్ష్మి, ఎంజి కిషన్, కమల, మాధవి, వెల్ఫేర్ బోర్డు సభ్యులు లక్ష్మి, సంపత్, హెల్త్ వాలంటీర్ సుజాత, సెక్యూరిటీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.