calender_icon.png 28 October, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తిలో తేమశాతం 12కు మించొద్దు

28-10-2025 12:14:03 AM

రైతులే తనిఖీ చేసుకుని, కేంద్రాలకు తేవాలి

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 

పీఎస్‌సీ కింద మొక్కజొన్న, జొన్నల కొనుగోలుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి 

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): పత్తిని కొనుగోలు కేంద్రాలకు రైతులు  తీసుకురాకముందే తేమ శాతాన్ని తనిఖీ చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. తేమ శాతం 12కు మించకూడదని, తేమ శాతం ఎక్కువైతే మద్దతు ధర లభించదని సోమవారం ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తేమ శాతం ఎక్కువ ఉన్న కూడా పత్తిని కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు.

సెప్టెంబరులోనే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. పత్తి రైతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని, రైతులకు ఎలాంటి సందేహాలు, ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5779 ను వెంటనే సంప్రదించాలన్నారు. కాగా రాష్ర్టంలో పెసర, మినుములు, సోయాబీన్ కోతలు పూర్తికావచ్చాయని, ప్రైస్ సపోర్ట్ స్కీమ్ (పీఎస్‌ఎస్) కింద వీటికి మద్దతు ధరకు సేకరించడానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు తుమ్మల తెలిపారు.

పెసర, మినుములు 100 శాతం, సోయాబీన్ 50 శాతం పంట సేకరణకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు ఇంకా రావాల్సి ఉందన్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆధ్వర్యంలో రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో మంత్రి తుమ్మల పాల్గొని, విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేంద్ర మంత్రి రెండు, మూడు రోజులలో అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

జొన్న, మొక్కజొన్న పంటలను కూడా పీఎస్‌ఎస్‌లో చేర్చి కనీసం 50 శాతం పంటల సేకరణకు అనుమతులు ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరారు. సోయాబీన్ పంట 25 శాతమే అనుమతి ఇవ్వడంతో గతేడాది రాష్ర్ట ప్రభుత్వమే మిగతా పంటను కొనుగోలు చేయాల్సి వచ్చిందని, కనీసం ఈసారైనా 50 శాతం పంట సేకరణ అనుమతివ్వాలని కోరారు. రాష్ర్టంలో సీసీఐ సేకరిస్తున్న పత్తి పంటకు తేమ శాతం నిబంధన ప్రకారం 8 నుంచి 12 శాతం ఉం డాలని, వాతావరణ పరిస్థితులు, వర్షాల కారణంగా కనీసం 50 శాతం  పంటల సేకరణకు అనుమతులు ఇవ్వాలని కోరారు.