calender_icon.png 17 July, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోటకే అత్యధిక కార్డులు!

16-07-2025 12:00:00 AM

  1. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
  2. మహబూబాబాద్ జిల్లాకు అత్యధికంగా 34,578 కార్డులు

మహబూబాబాద్, జూలై 15 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమాన్ని సోమవారం చేపట్టింది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తగా కేటాయించిన రేషన్ కార్డుల్లో మహబూబాబాద్ జిల్లాకు అత్యధికంగా దక్కాయి.

మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 79,917 రేషన్ కార్డులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేయగా, మహబూబాబాద్ జిల్లాకు 34,578 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. తర్వాత హనుమకొండ జిల్లాకు 13,718 రేషన్ కార్డులు మంజూరు కాగా, జనగామ కు 10,881, వరంగల్ కు 7,331, ములుగు కు 6,931, జయశంకర్ భూపాలపల్లికి 6,478 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. 

1,85,095 మందికి లబ్ది

కొత్తగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 79,917 రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయగా, 1,85,095 మంది లబ్ధిదారులకు కొత్తగా రేషన్ బియ్యం పొందనున్నారు. ఇందులో వరంగల్ జిల్లాలో 23,639, హనుమకొండ జిల్లాలో 42,395, జనగామ జిల్లాలో 35,070, మహబూబాబాద్ జిల్లాలో 44,330, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 19,471, ములుగు జిల్లాలో 20,190 మందికి కొత్తగా రేషన్ బియ్యం అందుకోనున్నారు.

ఆగస్టు తర్వాతే రేషన్ పంపిణీ?

కొత్తగా రేషన్ కార్డు మంజూరైన లబ్ధిదారులకు ఆగస్టు తర్వాత రేషన్ బియ్యం పంపిణీ చేయడం ప్రారంభిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం ఈసారి మూడు నెలలకు ముందుగానే రేషన్ బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంది.

జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రేషన్ కార్డుదారులకు గత నెలలో బియ్యం పంపిణీ పూర్తి చేసింది. దీంతో కొత్తగా రేషన్ కార్డుదారులకు ఆగస్టు నెల తర్వాతే బియ్యం మిగిలిన పాత రేషన్ కార్డు దారులతో పాటు ఇస్తారని అధికారులు వెల్లడిస్తున్నారు.