19-07-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్ జులై 18 ( విజయక్రాంతి); ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే దారిలో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమలలోని రెండు గ్రామాల పేర్లు మార్చుతూ తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జరీ చేసింది. ఈగల పెంట, దోమల పెంట గ్రా మాల పేర్లను ఆధ్యాత్మిక భావనను కల్పిస్తూ బ్రహ్మగిరి, క్రిష్ణగిరిగా పేర్లను మారుస్తూ ప్రభుత్వం జీఓ 26 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తగా ఎవరైనా శ్రీశైలం వెళ్లే క్రమంలో ఈ గ్రామాల పేర్లను చూసి ఒకింత ఆశ్చర్యానికి గురవడం సాధారణమే. పూర్వం దోమలపెంటకు బ్రహ్మగిరి, ఈగలపెంటకు క్రిష్ణగిరి అనే పేర్లు ఉండేవి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈ గ్రామాల పేర్లను దోమలపెంట, ఈగలపెంటగా మార్చడం జరిగింది. అప్పటినుంచి ఈ పేర్లతోనే ఆ గ్రా మాలు పిలవబడుతున్నాయి. కాగా ప్రజల కోరిక మేరకు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో సీఎం ఆదేశంతో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఆ రెండు గ్రామాల పేర్లను మార్చారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ బ్రహ్మగిరి గ్రామ బోర్డును ఆవిష్కరించారు. భ్రమరాంభ మల్లికార్జునులు వెలిసిన శ్రీశైలం క్షేత్రం సమీపంలో డ్యామ్ చెంతన ఉన్న ఈ గ్రామాల పేర్లు కూడా దేవుళ్ల పేర్లుగా మారడంతో గ్రామస్థులు, మల్లన్న భక్తులు, యాత్రికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.