11 May, 2026 | 7:30 AM

రానున్న ఐదు రోజులు వడగాలులే

25-04-2024 01:04 AM

వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్, ఏప్రిల్ 24(విజయక్రాంతి) : రానున్న ఐదు రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా దేశంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వేడిగాలులు అధికంగా ఉంటాయని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలతో పాటు సిక్కిం, కర్నాటక రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉండనున్నాయని వెల్లడించింది. బిహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, రాయలసీమ, తెలంగాణలోనూ వేడి ప్రభావం ఉంటుందని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌కు మాత్రం వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది.

అయితే దేశంలోని ఈశాన్య ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఒడిశా, బిహార్, ఆంధ్రప్రదేశ్, యానాం, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈశాన్యంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో అరుణాచల్ ప్రదేశ్‌లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

రాష్ట్రంలో భానుడి భగభగలు..

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా 45.1 డిగ్రీలు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 19.9 డిగ్రీల ఉష్ణోగ్రత  నమోదైనట్లు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధికంగా జూబ్లీహిల్స్ సర్కిల్‌లో 43 డిగ్రీలు, రాజేంద్రనగర్ సర్కిల్‌లో అత్యల్పంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత  నమోదైంది.