ముడుపులు ముడితేనే..ఫైలు ముందుకు
- కంప్యూటర్ గది తలుపులు మూసి పనులు
- కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు
- పైసలిస్తేనే పని అంటున్న దరఖాస్తుదారులు
- నెలలు గడిచిన ముందుకు కదలని దరఖాస్తులు
- రేషన్ కార్డులు జారీ చేయటంలో అలసత్వం
- ఓ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న దరఖాస్తు దారులు
- బట్టబయలు అయిన వ్యవహారం
నాగారం, సెప్టెంబర్ 2 :ఎన్నో ఏండ్లుగా నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదల కోసం చేపట్టిన ఉచిత రేషన్ కార్డుల పంపిణీ చేపట్టి పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతర రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగిస్తుండగా మండలం తహసిల్దార్ కార్యాలయంలో వ్యక్తిగత స్వార్థంతో అధికారులు ఈ పథకాన్ని నీరుగారుస్తున్నారు.
నూతన రేషన్ కార్డు కొరకై దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు తమకు నూతన రేషన్ కార్డు మంజూరు కాలేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరు కానీ రేషన్ కార్డు దరఖాస్తు దారులు తహసిల్దార్ కార్యాలయానికి ఎన్ని సార్లు వెళ్ళిన రేషన్ కార్డు ప్రక్రియ చేపట్టే అధికారిని తలుపులు ఎప్పుడూ వేసే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవహారం ఇలా బట్టబయలు..
మంగళవారం రోజున నాగారం గ్రామానికి చెందిన ఓ రేషన్ కార్డు దరఖాస్తు దారుడు తహసిల్దార్ కార్యాలయానికి 12.45 నిమిషాలకు వెళ్లగా మూసి ఉన్న తలుపులు దర్శనమిచ్చాయి. కాసేపు వేచి ఉండి అధికారులను రేషన్ కార్డు విషయమై తలుపులు తీయమని ప్రశ్నించగా దరఖాస్తుదారునిపై అధికారులు దురుసుగా మాట్లాడినట్టు బాహటంగానే చెబుతుండడం విశేషం. కలెక్టర్ కి చెప్పుకోండి మాకేం భయం అంటూ అతనిపై విరుచుకుపడ్డట్టు అతడే ప్రత్యక్షంగా చెబుతున్నాడు.
అనంతరం తనకు జరిగిన విషయం వివిధ గ్రామాల మాధ్యమాల గ్రూపు లలో(సోషల్ మీడియాలో)వైరల్ చేశాడు. ఇప్పటికైన తహసిల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఉన్నత అధికారులు సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆ వీడియోని తిలకించిన దరఖాస్తుదారులు కోరుతున్నారు.
కుల, ఆదాయ, కుటుంబ నిర్దారణ ధృవీకరణ పత్రాలకు పైసా వసూల్
కుల, ఆదాయ, కుటుంబ నిర్దారణ ధృవీకరణ పత్రాలకు పైసా వసూల్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలలు గడుస్తున్న దరఖాస్తులు ముందుకు కదలడం లేదని పైసా ఇస్తేనే పని చేస్తున్నారని లేదంటే దరఖాస్తులు పక్కకు పడాల్సిందేనని దరఖాస్తుదారుల ద్వారా తెలుస్తుంది.
గతంలో కూడా ఇదే కార్యాలయంలో గణాంకాల అధికారి కుటుంబ, జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ చేయడంలో ప్రజల నుండి పలు ఆరోపణలు రావడంతో రాజస్వ మండల అధికారి కార్యాలయానికి బదిలీ ఆయన ఘటన ఉంది. అయిన కూడా నాగారం తహసిల్దార్ కార్యాలయంలో అధికారుల తీరు మారడం లేదని ప్రజలు, దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.
అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు..
రేషన్ కార్డుల విషయంలో అధికారులు ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డ శాఖాపరమైన చర్యలు తప్పవు. ఏ సర్టిఫికెట్ మంజూరీకైనా ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకవస్తే తగు చర్యలు తీసుకుంటాం.
- హరికిషోర్ శర్మ, తహసీల్దార్






