29-07-2025 02:05:16 AM
జహీరాబాద్, జూలై 28 : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది జహీరాబాద్ నియోజకవర్గంలోని నారింజ ప్రాజెక్టు పరిస్థితి. ప్రాజెక్టులో నీరున్నా ఈ ప్రాంత రైతుల ఒక్క ఎకరాను కూడా తడపడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా ప్రాజెక్టు అమల్లోకి రాకపోవడం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారింది.
జహీరాబాద్ నియోజకవర్గంలోని కొత్తూరు బి గ్రామం వద్ద ఏర్పాటైన నారింజ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతుంది. దాదాపు 55 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టు నేటి వరకు అమల్లోకి రాలేకపోయింది. ఇందుకు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం.. అధికారులు అలసత్వం కారణంగా ప్రాజెక్టు వినియోగంలోకి రాకుండా పోతుంది. 20 డిసెంబర్ 1970లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో నిర్మించబడిన ప్రాజెక్టు అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా, బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా నారింజ తలరాత మాత్రం మారడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నారింజ ప్రాజెక్టు గురించి అభివృద్ధి చేస్తుందేమోనని రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నా వారి ఆశలు నిరాశలుగానే మిగిలిపోతున్నాయి.
ఈ ప్రాజెక్టు కింద దాదాపు 3000 ఎకరాల సాగుకు అధికారులు రూపకల్పన చేశారు. తదనంతరం జరిగిన పరిణామాలతో ఇప్పటివరకు నారింజ ప్రాజెక్టు ఒక్క ఎకరానికి కూడా నీరును అందించలేకపోయింది ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్టు నిండుకుండలా నిండుకొని గేట్ల పైనుంచి నీరంతా కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుండి వెళ్లిన ఈ నారింజ ప్రాజెక్టు వాగు కర్ణాటకకు వెళ్లిన తర్వాత కారంజ ప్రాజెక్టుగా మారింది.
కారంజ ప్రాజెక్టు వద్ద కర్ణాటక ప్రభుత్వం కారంజ చక్కెర కర్మాగారాన్ని నిర్మించింది. ఇక్కడి నుండి కర్ణాటకకు వృధాగా నీరు వెళుతుంది తప్ప ఇక్కడి అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదు. గతంలో ఈ ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో గేట్లను ఎత్తివేసి ఓ ప్రజా ప్రతినిధి వ్యవసాయం చేసుకున్నప్పటికీ అప్పటి ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదు.
స్వర్గీయ బాగా రెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగాను పనిచేసినప్పటికీ ఈ ప్రాజెక్టు గురించి, రైతుల బాగోగుల గురించి పట్టించుకోలేదని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గేట్లను మూసివేశారు. మిషన్ కాకతీయ ద్వారా ప్రాజెక్టులోని కూరుకుపోయిన మట్టిని పూడిక తీసి నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచారు.
టెండర్లు వేసినా పనులు శూన్యం...
నారింజ ప్రాజెక్టు కింద ఉన్న కాలువలను మరమ్మత్తులు చేసేందుకు నిధులు మంజూరు చేసి టెండర్లు అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పనులు చేయలేదు. ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్టులోకి వర్షాకాలంలో నీళ్లు రావడంతో ఝరాసంగం, జహీరాబాద్, న్యాల్కల్ మండలాల్లో గల రైతుల బోరు బావుల్లోకి భూగర్భ జలాలు పెరుగుతాయి. నారింజ వాగు బిలాల్పూర్ లో ప్రారంభమై కోహిర్, మదిరి పస్తాపూర్ మీదుగా కొత్తూరు ప్రాజెక్టులోకి నీరు చేరుకుంటాయి.
గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షానికి నారింజ ప్రాజెక్టు నిండుకుండలా మారి నీళ్లు గేట్ల పైనుంచి కర్ణాటక రాష్ట్రానికి తరలి వెళ్ళిపోతున్నాయి. నారింజ ప్రాజెక్టు గేట్ల వద్ద జహీరాబాద్ నుండి బీదర్ కర్ణాటక రాష్ట్రానికి వెళ్లే దారి ఉండడంతో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీని పైనుండి ఇరుకు రోడ్డు ఉండడంతో 55 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి ఇప్పటివరకు ఎలాంటి మరమ్మత్తులు చేయలేదు.
దీన్నిబట్టి చూస్తే జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అలసత్వం వహిస్తున్నారని చెప్పక తప్పదు. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నారింజ ప్రాజెక్టును అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. అధికారులు నారంజ ప్రాజెక్టును అమలులోకి తీసుకువచ్చి రైతులకు పంటలు పండించేందుకు నీరు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రైతులుకోరుతున్నారు.