calender_icon.png 2 November, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యం పదిలం

02-11-2025 04:49:58 PM

ధ్యానంతో వెలకట్టలేని ప్రయోజనాలు

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

హన్వాడ: ఆరోగ్యం పదిలంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ధ్యానం చేయడం ద్వారా వెలకట్టలేని ప్రయోజనాలు ప్రతి ఒక్కరి సొంతం అవుతాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం హన్వాడ మండలం దాచక్ పల్లి గ్రామంలోని మహేశా పిరమిడ్ ధ్యాన కేంద్రం 13వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నో గ్రామాల్లో ధ్యానం ప్రాచుర్యం ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదని, ధ్యానం ప్రయోజనాలను ప్రజల్లో మరింతగా విస్తరించాలన్నారు. పిల్లల్లో ఏకాగ్రత, మంచి ప్రవర్తన, సానుకూల దృక్పథం పెంపొందేందుకు ధ్యానం కీలకమని, సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉన్న ఈ కాలంలో పిల్లల మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు ధ్యానం తప్పనిసరి సాధనగా మారిందని చెప్పారు.

మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల అనుమతితో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించండి, ఇది కేవలం రూపకల్పన కాకుండా నిజమైన భక్తి, ఆత్మీయత, సేవభావంతో జరిగితేనే ఫలితాలు దక్కుతాయని సూచించారు. మనసును నియంత్రించగలిగితే సగం సమస్యలు స్వయంగానే పరిష్కారమవుతాయని, ధ్యానం అలవాటు చేసుకున్న పిల్లలు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారు. ఇది రాబోయే తరాలకు అందించగలిగే గొప్ప బహుమతి అన్నారు. ధ్యానం ప్రాధాన్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో అధికారిక సిలబస్‌లో చేర్చే దిశగా కృషి చేస్తామని, దీనిలో పూర్తి సహకారం అందిస్తానన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్‌.పీ. వెంకటేష్, బుద్దారం సుధాకర్ రెడ్డి, వేముల కృష్ణయ్య, టంకర కృష్ణయ్య యాదవ్, హన్వాడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వి. మహేందర్ యాదిరెడ్డి, మహేశా పిరమిడ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.