22 May, 2026 | 3:21 AM

అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ పారదర్శకతతో పూర్తి చేయాలి

22-05-2026 01:08 AM

జనగామ, మే 21 (విజయక్రాంతి):జిల్లాలో 2026-2028 సంవత్సరానికి సంబంధించిన మీడియా అక్రిడిటియేషన్ కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటియేషన్ కమిటీ చైర్మన్ సందీప్ కుమార్ ఝా అన్నారు.గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అక్రెడిటేషన్ కార్డుల ప్రక్రియపై  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా మీడియా అక్రిడిటియేషన్ కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ, దరఖాస్తుల సంఖ్య, పరిశీలన విధానం గురించి డీపీఆర్‌ఓ  ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన నిజమైన జర్నలిస్టులకే అక్రిడిటియేషన్ కార్డులు జారీ చేయాలని సూచించారు. వృత్తి ప్రమాణాలు, అనుభవం, సంస్థ గుర్తింపు వంటి అంశాలను ప్రామాణికంగా పరిగణించాలన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, బాధ్యతాయుతంగా నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలన్నారు.

అక్రిడిటియేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, ప్రతి దశలో పారదర్శకత పాటించాలని తెలిపారు.ఈ సమావేశంలో డీపీఆర్‌ఓ బండి పల్లవి, డీఎం ఆర్టీసీ స్వాతి, అక్రిడిటియేషన్ కమిటీ సభ్యులు ఈ. మల్లా రెడ్డి, ఎస్. బిక్షపతి, యూ. నరేందర్, కె.కిరణ్ కుమార్,వి. మధు,  జాల రమేష్, యూ. మహేష్, నీల నరేష్ బాబు, అబిద్ ఫైసల్ ఖురేషి, తదితరులు పాల్గొన్నారు.