22 May, 2026 | 3:23 AM

పైరవీకారులకు పండుగే..?

22-05-2026 01:06 AM

మెడికల్ బోర్డు కొనసాగింపు పై క్లారిటీ ఏది.?

పైరవీలకు అతీతంగా ఆన్ ఫిట్ చేయాలి

కార్మిక సంఘాలు మౌనం వీడాలి

బెల్లంపల్లి, మే 21: ఎట్టకేలకు మెడికల్ బోర్డుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అన్ ఫీట్ కోసం కొండకెదురు చూసినట్టు నిరీక్షిస్తున్న కార్మికులకు ఇది తీపి కబురే. ఇదే క్రమంలో సింగరేణిలో ఇప్పటి వరకు మెడికల్ బోర్డు నిర్వహణ తీరు పారదర్శకానికి ఆమడ దూరం అన్న సంగతి తెలిసిందే.

దళారులు, పైరవీ సంఘాల ప్రమేయం లేకుండా సింగరేణిలో మెడికల్ బోర్డు తన పని తాను చేయ లేని పరిస్థితి నెలకొంది. మెడికల్ బోర్డును నిలిపివేసి ఏడాది దాటింది. ఈ నేపథ్యంలో ఎంతో మంది కార్మికులు అనారోగ్యంతో విధులు చేయలేక డిస్మిస్ అయ్యారు. మరి ఎంతో మంది పదవీ విరమణ చేశారు. మెడికల్ బోర్డు నిలిపివేయడం వల్ల కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు దక్కకుండా పోయాయి. ఎంతో మంది సర్ఫేస్ పనులను చేసే అవకాశాన్ని కోల్పోయి చివరకి ఉద్యోగాలను వదులుకోవాల్సి వచ్చింది.

అధికారుల అనాలోచిత, కార్మిక సంఘాల లీడర్లు పట్టింపు లేనితనం వేరసి మెడికల్ బోర్డు వల్ల ఈ నష్టాలన్నీ కార్మికులు చవిచూడక తప్పలేదు. ఈ క్రమంలో మెడికల్ బోర్డు నిలిపివేయడం పట్ల సింగరేణి యాజమాన్యంపై కార్మిక లోకం ఆగ్రహం చెందింది. మెడికల్ బోర్డు నిర్వహణ స్తంభించడంతో జరిగిన నష్టాలను చూస్తూ కూడా జాతీయ కార్మిక సంఘాల లీడర్లు మౌనం వహించడం వల్ల వారిపై కూడా విమర్శలు పెల్లుబికాయి.

కార్మికుల నుంచి ఒత్తిడిని తట్టుకోలేక మనుగడకు ప్రమాదం ఏర్పడడంతో కార్మిక సంఘాలు మెడికల్ బోర్డుపై నోరు విప్పారు. ఒకరిని విడిచి ఒకరు జాతీయ సంఘాలన్నీ పోటాపోటీగా మెడికల్ బోర్డు కోసం యజమాన్యంపై ఒత్తిడి తెచ్చాయి. అవసరమైతే సమ్మె చేస్తామని కూడా కంపెనీ హెచ్చరించాయి. ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ 22, 23 తేదీల్లో రెండు రోజులు మెడికల్ బోర్డును నిర్వహిస్తారు.

ఆ రోజుకే పరిమితమా? యధాతధంగా కొనసాగుతుందా? అనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. దీనిపై కార్మికుల్లో అనుమానాలు గూడుకట్టుకున్నాయి. కార్మికుల అనుమానాలే నిజమైతే సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్టే. సింగరేణిలో మెడికల్ బోర్డు నిరంతరంగా అమలు చేయాలి. ఎప్పుడూ ఏ కార్మికుడు అనారోగ్యపాలవుతాడో తెలియదు. అందుకని మెడికల్ బోర్డును అనేది ఎప్పటికీ నిరంతర ప్రక్రియ. ఏడాది కాలం తర్వాత యాజమాన్యం ప్రత్యేక మెడికల్ బోర్డు పేరిట ఏర్పాటు చేయడంలో ఆంతర్యాన్ని కార్మిక సంఘాలు గ్రహించకపోవడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి.

కంపెనీ ఏం చెప్తే దానికే తలూపడమేనా? కార్మిక సంఘాల పని అనే ప్రశ్నలు కార్మికుల నుం చి వ్యక్తమవుతున్నాయి. మెడికల్ బోర్డుకు చేసుకున్న దరఖాస్తుదారుల కోసమే యజమాన్యo ఈ మెడికల్ బోర్డును స్పెషల్ గా ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది. 360 మం ది కార్మికులు సిక్ లోఉండి మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ స్పెషల్ మెడికల్ బోర్డు వారి కోసమే అన్నట్టుగా యజమాన్యం తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మెడికల్ బోర్డుపై నెలకొన్న అనుమానాలను అటు యజమాన్యం ఇటు కార్మిక సంఘాల లీడర్లు నివృత్తి చేయకపోవడం లేదు. 

- జోరుగా పైరవీలు..?

మెడికల్ బోర్డు ఏడాది కాలం విరామం తరువాత అమల్లోకి వచ్చింది. ఇంతకాలం మెడికల్ బోర్డు ఆగిపోవడంతో జాతీయ కార్మిక సంఘాల నాయకులు, దళారులు ఇంతకాలం ఎటూ పాలు పోలేదు. పైరవీలు నిలిచిపోయాయి. అడ్డదారిలో ఆదాయానికి గండిపడింది. మెడికల్ బోర్డు నిర్వహణపై యజమాన్య ప్రకటనతో పైరవీకరులు, దళారులు ఎగిరీ గంతేసారు. మెడికల్ బోర్డు కు వెళ్లే కార్మికులు పారదర్శకంగా అన్ఫిట్ ఆయ న సందర్భాలు సింగరేణిలో తక్కువే. లక్షలు చేతుల్లో పెడితేనే పనులు అవుతాయి.

ఇది అందరికీ తెలిసిందే.. ఇప్పుడు కూడా ఇదే తంతు కొనసాగుతుంది. పైరవీల ప్రమేయం లేకుండా మెడికల్ బోర్డు సజావుగా సాగదు. అన్ఫిట్ కావాలంటే అటు మెడికల్ బోర్డు అ ధికారులు, ఇటు పైరవీకారులు, దళారుల చే తులు తడపాల్సిందే. అలా కానీ పక్షంలో న డవలేని స్థితిలో ఉన్న ఒక్క కార్మికుడి కూడా ఫిట్ కాడు. లంచాలు ఇవ్వకపోతే సింగరేణి లో అంతేమరి.

అనారోగ్య బారిన పడ్డ ఎంతో మంది కార్మికులు ఆన్ ఫిట్ చేయమని అడిగితే మెడికల్ బోర్డు అధికారులు ఫీట్ చేసిన ఉదంతాలు సింగరేణిలో కోకొల్లలు. కార్మిక సంఘాలు, దళారులు, రెండు చేతు ల్లా దండుకుంటారు. ఇప్పటికైనా మెడికల్ బోర్డును పారదర్శకంగా చేపట్టాలని కార్మికు లు డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ బోర్డుపై నెలకొన్న అనుమానాలను సింగరేణి యాజమాన్యం పటాపంచలు చేయాలి. ఫైరవీలకి అతీతంగా జబ్బు పడిన కార్మికులను మాత్రమే ఆన్ ఫిట్ చేసి అర్హులైన కార్మికులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.