calender_icon.png 26 July, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుమ్మడికాయ కొట్టేశారు!

26-07-2025 12:13:26 AM

అగ్ర నటుడు చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మౌని రాయ్ ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించ నుంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది. చిరంజీవి, మౌని రాయ్‌లపై ప్రత్యేక గీతం చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రత్యేక గీతానికి శ్యామ్ కాసర్ల సాహిత్యం అందించగా, భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు.  ‘పుష్ప’, ‘పుష్ప2’ చిత్రాల్లో బ్లాక్‌బస్టర్ పాటలకు కొరియోగ్రఫీ చేసిన గణేశ్ ఆచార్య 100 మంది డ్యాన్సర్లతో ఈ సాంగ్‌ను తెరకెక్కించారు.

చిరంజీవి డ్యాన్స్ ఫ్లోర్‌లో మరోమారు తన సిగ్నేచర్ గ్రేస్‌తో అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది. మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మౌని రాయ్ స్పార్క్ ను సైతం ఇందులో చూడొచ్చని అర్థమవుతోంది. చిత్రీకరణ పనులకు గుమ్మడికాయ కొట్టేసిన టీమ్.. ఇక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్, ప్రచార కార్యక్రమాలను ప్రారంభించే పనులకు సన్నద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: చోటా కే నాయుడు; ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్.