26-07-2025 12:16:01 AM
-తెలుగు ఫిలిం ఛాంబర్‌కు నిర్మాతల అల్టిమేటం
షెడ్యూల్ ప్రకారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదంటూ పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు అల్టిమేటం విధించారు. హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు ఈ విషయాన్ని ప్రకటించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ మాజీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 150 మందికి పైగా నిర్మాతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. “ఛాంబర్‌లో నిరంకుశంగా మేమే కమిటీలో కొనసాగుతామనడం తప్పు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలవబోతున్నాం. మన ఎంపీలతో పార్లమెంట్‌లోనూ ఈ విషయాన్ని లేవదీస్తాం” అన్నారు. కేఎస్ రామారావు మాట్లాడుతూ.. “50 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న అసోసియేషన్ ను క్రమశిక్షణతో కొనసాగించాలి. ఇప్పుడున్న అధ్యక్షుడు భరత్‌భూషణ్, సభ్యులు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి” అన్నారు.
అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. “ఛాంబర్ ఈసీ మీటింగ్‌లో అంబికా ప్రసాద్ అనే ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ చెప్పాడని ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రస్తుత కార్యవర్గంలో ఉన్న నాయకులు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఛాంబర్ మనకు దేవాలయం లాంటిది. ఇక్కడే తప్పు జరిగితే రేపు ప్రభుత్వాల దగ్గరకు వెళ్లి ఎలా మన సమస్యలు చెప్పుకుంటాం. ఇప్పుడున్న కమిటీలో నేనూ పదవిలో ఉన్నా, ఎన్నికలు లేకపోతే, నేనూ మరో దఫా పదవిలో కొనసాగవచ్చు.
కానీ అది నిబంధనలకు విరుద్ధం. నేను ఈ విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని, మంత్రి పొంగులేటిని కలిసి లెటర్స్ ఇచ్చాను. ఈ నెల 30తో ప్రస్తుత కమిటీ గడువు ముగుస్తుంది. వెంటనే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపాలి. లేకపోతే రేపట్నుంచి ఇక్కడే కూర్చుంటాం. మీరు తిరుపతిలో ఈసీ మీటింగ్ పెట్టినా మళ్లీ ఇక్కడికే రావాలి” అన్నారు. విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. “రెండు ప్రభుత్వాలకు దగ్గరగా ఉన్నామనే కారణం సరైనది కాదు.
ఎన్నికైన కమిటీతోపాటు మీలో పరిచయాలున్న వారు వస్తే ప్రభుత్వాలకు రిప్రంజటేషన్స్ ఇద్దాం” అన్నారు. బసిరెడ్డి మాట్లాడుతూ.. “నాక్కూడా సీఎం రేవంత్‌రెడ్డి, జైపాల్‌రెడ్డిల కుటుంబాలతో సత్సంబంధాలున్నాయి. అయినంతమాత్రాన నేను ప్రెసిడెంట్ పదవిలో కూర్చుంటానంటే ఎలా ఉంటుంది? సభ్యుల్లో ఆదరణ ఉంటే మళ్లీ గెలవండి” అన్నారు. “నేను ఫిలింఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యక్రమం కోసం కోల్‌కతా వచ్చాను.
అందుకే ఈ ప్రెస్‌మీట్‌కు రాలేకపోయా. ఇంతకాలం అసోసియేషన్‌ను ఒక పద్ధతిలో కొనసాగిస్తూ వచ్చాం. ఇప్పుడు కొందరు స్వార్థంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నెల 30న జరిగే ఈసీ మీటింగ్ తీసుకెళ్లి తిరుపతిలో పెడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం” అని సీ కల్యాణ్ అన్నారు