వనదుర్గమ్మ సన్నిధిలో ప్రైవేట్ వ్యాపారుల దందా..
- ఎలాంటి టెండర్ లేకుండా కబేలా నిర్వహణ
- మేక బరువుతో సంబంధం లేకుండా ఇష్టారీతిన నగదు వసూలు
- దోపిడీకి గురవుతున్న భక్తులు..
- అంతా తెలిసినా స్పందించని అధికారులు
పాపన్నపేట,మే3:జనమేజయుడు సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ క్షేత్రం.. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆలయం.. జంట నగరవాసులు, పొరుగు రాష్ట్రాల వారిని సైతం ఆకర్షిస్తున్న ఆధ్యాత్మిక క్షేత్రం.. ఏడాది పొడవునా భక్తులతో కిటకిటలాడే ప్రాంగణం.. ఏటా రూ. కోట్లలో సమకూరే ఆదాయం.. దేశంలోనే రెండోవ వనదుర్గామాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.
ఆ భక్తులను కొందరు వ్యాపారాల పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారు. కోరిన కోరికలు తీరితే వన దుర్గమ్మకు మేకపోతులను బలిస్తామని భక్తులు మొక్కుకుంటారు. అయితే మేక ఎంత బరువు ఉన్నా సరే రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. భక్తులు చేసేదేమీ లేక ఎంత అడిగితే అంతా ముట్ట చెబుతున్నారు. ఆదివారం, సెలవు రోజుల్లో వందల సంఖ్యలో మేకలను వనదుర్గమ్మకు బలి ఇస్తుంటారు. ఈ లెక్క ప్రకారం భక్తుల వద్ద ఎంత దోపిడీ చేస్తున్నారో అర్థం అవుతుంది.
ఈ తతంగమంతా అధికారులకు తెలిసే జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని భక్తులు మండిపడుతున్నారు. వనదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుందామని వస్తే ఇలా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో సుమారు 50 వరకు సత్రాలు ఉన్నాయి. గతంలో సత్రాల వద్ద బలి ఇచ్చిన మేకను అక్కడే శుభ్రం చేసి, మేక వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయడంతో సత్రాల వద్ద అపరిశుభ్రత చోటు చేసుకుంటుంది.
దీంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయని 2017లో పాలకమండలి సభ్యులు ఆలయ సమీపంలో కబేలా నిర్మించాలని నిర్ణయించారు. 2017 నవంబర్ 28న అప్పటి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హాజరై కబేలా నిర్మాణానికి భూమి పూజ చేశారు. మెదక్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కబేలా నిర్మాణం పనులు దక్కించుకొని పూర్తి చేశాడు. కబేలా నిర్మించేందుకు సంబంధిత శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అప్పుడు ఉన్న ఆలయ ఈవో వెంకట కిషన్ రావు, పాలకమండలి కబేలా నిర్మాణం పూర్తి చేశాక అనుమతులు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో నిర్మాణాన్ని పూర్తి చేశాడు.
నిర్మాణం పూర్తయ్యాక కొన్ని సంవత్సరాలు వరకు దానిపై హక్కుదారుడిగా వ్యవహరించి ఆ తర్వాత దేవస్థానానికి అప్పగించేలా అనుమతులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కబేలా నిర్మించి సుమారు 9 సంవత్సరాలు గడుస్తుంది. నిర్మించిన వ్యక్తి సుమారు ఆరు సంవత్సరాలుగా కబేలాలో దందా కొనసాగించాడు. 2023 నుంచి సుమారు రెండు సంవత్సరాల పాటు ఆలయం తరపున కబేలాను కొనసాగించగా.. మరల ఎలాంటి టెండర్ లేకుండా అదే వ్యక్తికి అప్పజెప్పడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 20 కిలోల వరకు బరువు ఉన్న మేకకు రూ. 500 తీసుకోవాల్సి ఉండగా, రూ. 1000 వసూలు చేస్తున్నారు. బరువుతో లెక్క లేకుండా ఇష్టారీతిన భక్తులను దోపిడీ చేస్తున్నారు.
10 కిలోల మేకకు రూ.900 తీసుకున్నారు
వనదుర్గమ్మ కు మేకపోతును బలి ఇస్తానని మొక్కుకున్నాము. మొక్కు తీర్చేందుకు ఆదివారం ఏడుపాయలకు వచ్చాం. కబేళాలో మేకను శుభ్రం చేయిద్దామని ఇక్కడికి రాగా 10 కిలోలు ఉన్న మా మేకకు రూ.900 తీసుకున్నారు.
ధనుష్, భక్తుడు, పటాన్చెరు
ఈవో తో మాట్లాడి చర్యలు తీసుకుంటాం
ఈ విషయమై ఈవోతో మాట్లాడి సంబంధిత వ్యాపారిపై చర్యలు తీసుకుంటాం. భక్తులను దోపిడీకి గురి చేస్తే ఉపేక్షించేది లేదు. భక్తులు సైతం జాగ్రత్తగా వ్యవహరించి నగదు చెల్లించాలి. వెంటనే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.
రామకృష్ణారావు, ఆర్ జే సీ






