06-09-2025 12:00:00 AM
ఎల్బీనగర్, సెప్టెంబర్ 5 : ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్‌ఆర్‌ఆర్(రీజినల్ రింగ్ రోడ్డు)తో వ్యవసాయం ధ్వంసం అవుతుందని, వేలాది మంది చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ప్రభుత్వం స్పందించి రీజినల్ రింగ్ రోడ్డు మార్గాన్ని మార్చాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. హయత్ నగర్ లోని లెక్చరర్ కాలనీలో శుక్రవారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మండల ఉపాధ్యక్షుడు నడికుడి అంజయ్య మాట్లాడుతూ... ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం రీజినల్ రింగ్ రోడ్డుకు భూ సేకరణ చేయడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ చేస్తున్నారన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు వేస్తామని చెప్పి, కేవలం 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల మీదుగా రోడ్డు వేయడం సరికాదన్నారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న కంపెనీల భూములను కాపాడడానికి చిన్న, సన్నకారు రైతుల ప్రాణాలు తీస్తారా? అని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదించారని ఆరోపించారు. ట్రిపు ల్ ఆర్ నిర్మాణంతో సారవంతమైన భూములు, చెరువులు, కుంటలు కనుమరుగై, వ్యవసాయం పూర్తిగా దెబ్బతిం టుందని హెచ్చరించారు.
మా ప్రాణాలు పోయినా భూములు ఇవ్వమని, పోరా టం చేసి మా భూములు కాపాడుకుంటామని తెలిపారు. తెలంగాణలో ఎక్కడై నా భూసేకరణ జరిగితే రైతులు బలవుతున్నారని, ధనవంతులు భూములు కోల్పోవడం లేదన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుతో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు రోడ్డున పడుతున్నారని తెలిపారు. ప్రభు త్వ భూములు అధికంగా ఉన్న ప్రాం తాల మీదుగా రోడ్డు నిర్మించాలని సూ చించారు.
ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమ భూములను ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సరైన సమాధానం చెప్పకుండా, రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు మార్గాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పుట్టపాక, సర్వేలు, వివిధ గ్రామాలకు చెందిన భూనిర్వాసిత రైతులు పాల్గొన్నారు.