17 May, 2026 | 4:03 AM

కేసుల దర్యాప్తులో ‘సీసీ’ల పాత్ర కీలకం

21-06-2024 12:10 AM

రాచకొండ సీపీ తరుణ్ జోషి

హైదరాబాద్ సిటీబ్యూరో/యాదాద్రి భువనగిరి, జూన్ 20 (విజయక్రాంతి): రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు ప్రధాన, సంక్లిష్ట కేసుల దర్యాప్తులో ప్రముఖ పాత్ర పోషించిన రాచకొండ ఐటీ సెల్ సీసీ టీవీ బృందాన్ని సీపీ తరుణ్ జోషి గురువారం అభినందించి నగదు పురస్కారం అందించారు. ఇటీవల మేడిపల్లి, భువనగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చైన్‌స్నాచింగ్ కేసులతో పాటు చర్లపల్లి పరిధిలో జరిగిన ప్రాపర్టీ కేసు వంటి పలు సంక్లిష్టమైన కేసులను త్వరితగతిన ఛేదించడంలో ఐటీ సెల్ సీసీ టీవీ బృందం కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. దొంగతనాలు, దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, స్త్రీలు, పిల్లల అపహరణ వంటి ఎన్నో కేసుల దర్యాప్తులో సీసీ టీవీల పాత్ర  కీలకమన్నారు. కార్యక్రమంలో ఐటీ సెల్ ఏసీపీ నరేందర్ గౌడ్, ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

హెడ్ కానిస్టేబుల్‌కు సీపీ అభినందన.. 

ఇటీవల జరిగిన నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అంబోజు అనిల్‌కుమార్ పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపి మూడు స్వర్ణ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్‌ను కమిషనర్ తరుణ్ జోషి అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తున్న అనిల్‌కుమార్‌కు పోలీస్ శాఖ నుంచి పూర్తి సహకారాలు అందిస్తామని తెలిపారు.