19-12-2025 12:39:39 AM
కేటీఆర్ విమర్శలపై స్పందించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల,డిసెంబర్ 18: రాష్ట్రంలో సర్పంచులను చంపింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, కమీషన్ల కక్కుర్తితో వేల కోట్ల రుపాయల ఇరిగేషన్ బిల్లులను చెల్లించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్పంచుల బిల్లులను చెల్లించకపోవడంతో అనేక మంది సర్పంచులు గుండెపోటుతో మరణించారని, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారనే విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో సర్పంచులను చంపింది మీరు కాదా కేటీఆర్ అని ఆయన నిలదీసారు. పంచాయితీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గురువారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిరుధ్ రెడ్డి మాట్లాడారు.తాను ఎన్నికల ప్రచార సమయంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చంపుతామని బెదిరిస్తున్నారంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అనిరుధ్ రెడ్డి స్పందిస్తూ, సర్పంచులను చంపిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ గుర్తించాలని కోరారు.
బిల్లులు చెల్లించని కారణంగా కొందరు సర్పంచులు గుండె పోటుతో మరణించగా, మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని,కమీషన్లు వస్తాయని ఇరిగేషన్ బిల్లులు చెల్లింపులపై చూపిన శ్రద్ధ సర్పంచుల బిల్లులపై చూపించలేదని తీవ్రంగా విమర్శించారు. పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఎన్నికల సమయంలో తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వీడియో పెట్టి ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని విమర్శించారు.
కౌశిక్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్న బీఆర్‌ఎస్ నేతలు పంచాయితీ ఎన్నికల్లో కూడా తమకు ఓటు వేయకపోతే తాము చచ్చిపోతామంటూ ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి గెలవాలని ప్రయత్నించారని ఆరోపించారు. చచ్చిపోతామని బెదిరించిన వారు గెలిచి వస్తే అలాంటి వారికి నిధులు ఇవ్వకుండా చంపేస్తానని మాత్రమే తాను చెప్పానని స్పష్టం చేసారు.తాను సర్పంచులను కత్తితో పొడిచి చంపుతానని అనలేదు కదా?అని పేర్కొన్నారు.
కొంత మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులు స్కూళ్లకు వెళ్లే తమ పిల్లలతో కాళ్లు మొక్కించి ఓట్లు అడుక్కున్నారని అనిరుధ్ రెడ్డి చెప్పారు.అయితే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ 10 శాతం సర్పంచ్ స్థానాలను కూడా నేరుగా గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేసారు.
ఇండిపెండెంట్లు గెలిచిన స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకొని జబ్బలు చరుచుకుంటున్నారని బీఆర్‌ఎస్ నేతలను అనిరుధ్ రెడ్డి ఎద్దేవా చేసారు.పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఇచ్చిన తీర్పు విషయంగా మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.