29-01-2026 12:00:00 AM
భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూటమి మధ్య మంగళవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదరడం చారిత్రకం. భారత ప్రధాని మోదీ, ఈయూ కూటమి నేతలు ఉర్సులా వాన్‌డెర్, ఆంటోనియో కోస్టా సమక్షంలో సంతకాలు జరిగాయి. ఇది అమల్లోకి వచ్చేందుకు కాస్త సమయం పట్టొచ్చు. కానీ యూరప్ కూటమితో కుదిరిన ఈ ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణించడం గొప్ప విషయం. ఈయూ (27 దేశాలు), భారత్ జనాభా కలిపితే దాదాపు -200 కోట్లకు పైగా ఉంటుంది.
ప్రపంచ జీడీపీలో ఈ ఒప్పందం విలువ నాలుగోవంతుకు సమానం. అందుకే ఇంత పెద్ద మార్కెట్ మరే ఒప్పందంలోనూ సాధ్యపడదు. అందుకే ఈ డీల్ ప్రపంచ దేశాలను ఆకర్షించింది. -నిజానికి ఈయూ-, భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం 2007లోనే -చర్చలు మొదలయ్యాయి. కొన్ని అంశాలపై అభిప్రాయాలు కుదరక చర్చలు నిలిచిపోయాయి. మళ్లీ 2022 నుంచి చర్చలు ఊపందుకున్నా-యి. అయితే ఈయూ కూటమి భారత్‌తో ఎఫ్‌టీఏ చేసుకోనున్నట్లు ఇటీవల దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాకా సుంకాల అస్త్రాన్ని ప్రయోగించడంతో ప్రపంచంలో ఆర్థిక అస్థిరత మొదలయ్యింది.
ట్రంప్ తన ఒంటెద్దు పోకడ నిర్ణయాలతో మిత్ర దేశాలను సైతం దూరం చేసుకుంటున్నారు. గ్రీన్‌లాండ్ వ్యవహారంలో ఈయూ మద్దతు ఇవ్వకపోవడంతో ఆ కూటమికి చెందిన ఐదు దేశాలపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. దీంతో ట్రంప్ వైఖరితో పొసగని ఈయూ కూటమి ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే భారత్‌తో పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన సంతకాల ప్రక్రియను పూర్తి చేసింది. భారత్, ఈయూ మధ్య కుదిరిన ఈ ఒప్పందం అమెరికాకు మింగుడు పడని అంశంగా తయారయ్యింది.
ఈ ఒప్పందం ఇటు భారత్‌ను.. అటు ఈయూను పెద్ద మార్కెట్‌గా తయారయ్యేలా చేయడంతో పాటు అమెరికాకు ధీటుగా జవాబు చెప్పగల శక్తిగా రూపాంతరం చెందింది. ట్రంప్ దుందుడుకు చర్యలకు ఇది చెంపపెట్టు. రూపాయి- మధ్య వాణిజ్యం జరిగితే ఇరు ఆర్థిక వ్యవస్థలు బలపడడంతో పాటు డీ జరగడం వల్ల అమెరికా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయవచ్చు. ఈ మధ్య పలు దేశాలతోనూ భారత్‌కు ఎఫ్‌టీఏలు కుదిరాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజి లాండ్, ఒమన్, మారిషస్, యూఏఈలతో పాటు ఐస్‌లాండ్, లిచెన్‌స్టీన్, నార్వే, స్విట్జర్లాండ్‌లతో కూడిన యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్‌టీఏ)తో ఎఫ్‌టీఏలపై సంతకాలు చేసింది.
అయితే ట్రంప్ అడ్డగోలు టారిఫ్‌లు ఒకింత భారత్‌కు మేలు చేశాయని చెప్పొచ్చు. ప్రపంచం లోనే భారత్ జనాభా అధికంగా ఉన్నప్పటికీ ఇందులో యువత సంఖ్యే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ రాబోయే దశాబ్దంలో మూడో స్థానానికి చేరుకునే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో ఈయూ కూటమికి భారత్ అతిపెద్ద వాణిజ్య మార్కెట్‌గా కనిపించడం సానుకూలాంశం. తాజా ఒప్పందంతో భారత్‌కు చెందిన పెట్టుబడులు భారీ స్థాయిలో ఈయూ దేశాల మార్కెట్‌లోకి ప్రవేశించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవ్వనుంది.