calender_icon.png 30 January, 2026 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుండి ఐదు రోజులు ఘనంగా ఊర పండగ ఉత్సవాలు

30-01-2026 10:05:11 AM

కామారెడ్డి, జనవరి 30,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల(Domakonda Mandal) కేంద్రంలో శుక్రవారం ఉదయం నుండి గ్రామమంతా ఏకమై అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో దోమకొండలో ఊర పండుగకు(Ura Panduga) సర్వం సిద్ధం చేశారు. సుమారు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఊర పండుగ నిర్వహించగా...నేటి నుండి ఐదు రోజులు పాటు ఘనంగా ఊర పండుగ ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

  సార్గమ్మ నిలయమైన బురుజు కోటకు విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరణ చేశారు. కట్ట మైసమ్మ,ఊరడమ్మ, ముత్యాలమ్మ ,నల్ల పోచమ్మ, ఆలయాల వద్ద సైతం అలంకరణ ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవార్ల విగ్రహాలు, పాదాలు, ఏనుగులు, రాట్నాలు, పలకలు ఆయుధాలను తయారు చేశారు. సర్పంచ్ ఐరన్ నరసయ్య, ఉప సర్పంచ్ బొమ్మెర  శ్రీనివాస్, పాలకవర్గపు సభ్యులు, కుల సంఘాల ప్రతినిధులు కలిసి ఊర పండగకు సంబంధించి నిర్వహణ కమిటీ వేసుకుని పండగను ఘనంగా జరిపేందుకు సిద్ధమయ్యారు.

శుక్రవారం ఉదయం ముడుపు కట్టుట (గ్రామం దిగ్బంధం),చల్లని అంబలి చేయడం, కొలువు వేయడం,సాయంత్రం గ్రామ దేవతలకు బోనాలు తీయడం చేస్తారు.శనివారం గ్రామంలో కొలుపుల తల్లి గ్రామ పర్యటన ,ఆదివారం సార్గమ్మ వద్ద రంగం, గావు ,స్థానికులు గ్రామం వదిలి వంటలకు పోవడం, సోమవారం ఊడమ్మకు పూజలు, రంగం ,గావు, మంగళవారం కట్టమైసమ్మకు పూజలు, రంగం, గావు, వంటలకు పోవడం కార్యక్రమాలు నిర్వహించినట్లు సర్పంచ్ నరసయ్య పేర్కొన్నారు. ఊర పండగను ఘనంగా విజయవంతం చేయాలని నిర్వహణ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలను కోరారు.