29-01-2026 12:00:00 AM
వార్తా పత్రికలు మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, సామాజిక న్యాయాలు, ప్రభుత్వ పాలనలో మంచి చెడులు, పౌరసమాజాన్ని జాగృత పరచడం, అవసరమైన సమాచార వితరణను వెలుగులోకి తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వార్తాపత్రిక ప్రాధాన్యాన్ని ప్రచారం చేయడానికి ప్రతి ఏటా జనవరి 29వ తేదీని మన దేశంలో ‘భారతీయ వార్తాపత్రికల దినోత్సవం’ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. భారతదేశంలో తొలిసారి జేమ్స్ అగస్టస్ హిక్కీ నేతృత్వంలో బృందం కలకత్తా నుంచి ‘హిక్కీస్ బెంగాల్ గెజిట్’ పేరుతో 1780, జనవరి 29న తొలి వార్తాపత్రికను ప్రచురించారు. దీనినే కలకత్తా జనరల్ అడ్వర్టుజర్ అని మరో పేరుతో కూడా పిలుస్తారు. ఈ వార్తాపత్రిక నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వార్తలను ప్రజలకు చేర్చడంతో భయపడిన నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1782లో ఈ పత్రికను రద్దు కూడా చేసింది. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య పటిష్టమైన వారధిగా పత్రికలు సేవలు అందిస్తున్నాయి.
అవినీతిని బయట పెట్టడం, అక్రమార్కుల భరతం పట్టడం, సమ్మిళిత అభివృద్ధికి ఉత్ప్రేరకంగా నిలవడం, పేదల పక్షాన నిలబడి పోరాడ డం లాంటి ప్రధాన కర్తవ్యాలను నిర్వహిస్తున్న వార్తాపత్రికల మనుగడను నేటి డిజిటల్ సాంకేతిక వేదికలు మసకబార్చుతున్నాయి. డిజిటల్ రాకతో సంప్రదాయ వార్తాపత్రికల ఆదరణ క్రమంగా కొ ట్టుకుపోతున్నది. ఆన్‌లైన్ పత్రికలు, సామాజిక మా ధ్యమంలో పోస్టింగ్స్ వల్ల పాఠకుల్లో వార్తాపత్రికల పట్ల దృష్టికోణం మారిపోతున్నది. క్షణాల్లో డిజిటల్ వేదికల్లో ప్రపంచ వార్తలు ప్రజలకు చేరుతున్నాయి. టీవీ చానెల్స్ ప్రసారం చేస్తున్న 24 గంటల వార్తలతో పేపర్ చదవాలన్న వాంఛ కూడా క్రమేపీ తగ్గిపోతున్నది.
వార్తాపత్రికల్లో ప్రకటనల రెవిన్యూ తగ్గడం, వినియోగదారుల అభిరుచులు మారడం, వార్తాపత్రికల మధ్య పోటీతత్వం, ముద్రణ, నిర్వహణ ఖర్చులు పెరగడం, ప్రాంతీయ భాషలు పుట్టుకురావడం, డిజిటల్ వేదికలు ఏకీకరణ కాకపోవడం, వార్తాపత్రికపై నమ్మకాలు సన్నగిల్లడం లాంటి సవాళ్ల నడుమ వార్తాపత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. రానున్న రోజుల్లో వార్తాపత్రిక మనుగడ సుసాధ్యం కావడానికి నిక్కచ్చి వార్తలను అందించడం, నాణ్యమైన సమాచారం చేరవేయడం, డిజిటల్ ఇంటిగ్రేషన్ సాధించడం, విలేకరులు నిజాయితీతో కూడిన సేవలు అందించడం, తటస్థ పాత్రలో పత్రికలను నడపడం, పాఠకుల అభిరుచుల ఆధారంగా పత్రికల్లో సమయానుకూలంగా మార్పులు చేయడం, ఖచ్చితమైన సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం లాంటి చర్యలను పత్రికా యాజమాన్యాలు తప్పనిసరి చేయాలి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పౌర సమాజం వార్త పత్రికలను ఆదరించేలా నాణ్యతతో కూడిన వార్తలు అందించాలని కోరుకుందాం.
బుర్ర మధుసూదన్ రెడ్డి, 9949700037