27-07-2025 12:01:55 AM
- విదేశీయుల చేతిలో ఆరుసార్లు ధ్వంసమైన ఆలయం
- ఆలయ గోడలు కూల్చి సొత్తును ఎత్తుకెళ్లిన మహ్మద్ గజనీ
- ఆలయాన్ని పడగొట్టి మసీదును నిర్మించిన ఔరంగజేబు
-చివరగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చేతుల మీదుగా ఆలయ పునర్నిర్మాణం
సోమనాథ్.. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది. అత్యంత ప్రాచీన శివాలయమైన సోమనాథ్ పుణ్యక్షేత్రం.. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర వెరావల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనినే ‘ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు. అరేబియా సముద్రతీరానా వెలసిన సోమనాథుడు.. సముద్రపు అలల తాకిడిన తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్లతో నిర్మించిన మట్టం మీద ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి.. ఓంకారంతో అమర్చి ఉంటుంది. ఎంతో ప్రఖ్యాతి కలిగిన సోమనాథ ఆలయం భారతదేశంపై దండయాత్రకు వచ్చిన వ్యక్తుల చేతుల్లో ఆరుమార్లు ధ్వంసమైనప్పటికీ.. తిరిగి పునః నిర్మాణంతో నేటికి బలంగా నిలబడటం ఆలయం విశిష్టతను తెలుపుతుంది.
ఆరుసార్లు ధ్వంసం..
ఈ ఆలయాన్ని ముందుగా నిర్మించింది సాధారణ యుగము అని చరిత్ర పేర్కొంటుంది. రెండోసారి యాదవ రాజైన వల్లబాయి తొలుత ఆలయాన్ని ఎక్కడైతే నిర్మించారో అక్కడే క్రీపూ 649లో పునర్నిర్మించాడని అంచనా. ఆ తర్వాత క్రీ శ 725లో సింధూ నగర అరబ్ గవర్నర్ జనయాద్ ఈ ఆలయ ధ్వంసానికి తన సైన్యాన్ని పంపాడు. క్రీశ 815లో గుర్జర ప్రతిహారా రజైన రెండవ నాగబటా ఈ ఆలయాన్ని మూడోమారు ఎర్ర ఇసుక రాళ్లతో నిర్మించినట్టు చరిత్రలో పేర్కొన్నారు. అయితే క్రీశ 1024లో థార్ ఎడారి గుండా భారత్‌పై దండయాత్రకు వచ్చిన తుర్కియే రాజు మహ్మద్ గజనీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. దాదాపు 30వేల మంది సైనికులతో సోమనాథ్‌కు చేరుకున్న మహ్మద్ గజనీ ఆలయ గోడలను ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకెళ్లారు.
గజనీ దండయాత్ర సమయంలో సోమనాథ్ ఆలయం చాలా సంపన్నమైనది. రెండు రోజుల పాటు జరిగిన భీకర యుద్ధంలో 70వేల మంది సైనికులు మరణించిన తర్వాత మహ్మద్ గజనీ పట్టణాన్ని స్వాధీనం చేసుకొని శివలింగం సహా అపారమైన సంపదను దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. ఆలయ దోపిడీలో మహ్మద్ గజనీకి రెండు మిలియన్ దినార్ల సొత్తు దొరికిందని.. దీని విలువ భారత కరెన్సీలో సుమారు 500 కోట్లకు పైమాటే. ఆ తర్వాత 1299లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ మరోసారి సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. హిందూ దేవాలయాలను కూలగొట్టాలని ఆదేశించడంతో మిలిటరీ జనర్ ఉలుగ్ ఖాన్ సోమనాథ్‌కు వెళ్లి ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
ఆ తర్వాత 1395లో గుజరాత్ కమాండర్‌గా పనిచేస్తున్న జాఫర్ ఖాన్ మరోసారి సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు చరిత్ర పేర్కొంటుంది. 15వ శతాబ్దంలో మహ్మదు బెగడా ఆలయాన్ని మరోసారి కూల్చాడు. చివరగా క్రీశ 1701లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడి రాళ్లను ఉపయోగించి మసీదును నిర్మించినట్టు చరిత్ర సాక్ష్యాలు పేర్కొంటున్నాయి. అయితే క్రీశ 1783లో పూనా పేష్వా, నాగపూర్‌కు చెందిన భోన్స్‌లే, ఖోలాపూర్‌కు చెందిన చత్రపతి భోన్‌స్లే, ఇండోర్‌కు చెందిన హోల్కార్ రాణి, గ్వాలియర్ రాజు శ్రీమంత్ పతిభువా సమష్టి సహకారంతో ఆలయం పునర్నిర్మించబడింది. అయితే ఔరంగజేబు కట్టించిన మసీదుకు సమీపంలోనే సోమనాథ్ ఆలయాన్ని తిరిగి నిర్మించడం విశేషం.
సోమనాథ్ స్థలపురాణం..
ధక్షుడి కుమార్తెలు 27 మందిని చంద్రు డు వివాహం చేసుకోగా.. వారిలో రోహిణి మీదే అతను ఎక్కువగా అభిమానం చూపించేవాడు. దీంతో ఆగ్రహించిన మిగిలిన భార్య లు.. తమ తండ్రి దక్షునితో విన్నవించుకుంటారు. చంద్రుడు తమ మీద ఎటువంటి అ భిమానం చూపడం లేదని, రోహిణి మీదే ప్రేమ చూపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశా రు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దక్షుడు.. తన అల్లుడైన చంద్రుడిని శపించాడు. అతని శాపంతో చంద్రుడు క్షయ వ్యాధి బారిన పడతాడు. అప్పుడు తన తప్పును తెలుసుకున్న చంద్రుడు.. తనకు ప్రాప్తించిన వ్యాధి నివారణ కోసం ఇక్కడ శివలింగాన్ని స్థాపించి నిత్యం పూజించాడు. అతడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమే శాపవిమోచనుడిని చేశాడు. చంద్రుడు శాపవిమోచనం పొందిన ప్రదేశమే ఈ ప్రభాస తీర్థం. చంద్రుడు స్థాపించిన లింగంలో తాను కొలువై ఉంటానని శివుడు మాట ఇవ్వడంతో.. సోమనాథ్ లో కొలువైన శివుడిని సోమనాధుడు అనే పేరుతో పిలుస్తుంటారు.
చివరగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో..
స్వాతంత్య్రం రాకముందు జునాగఢ్ రాజ సంస్థానం ప్రభాస్ పటాన్ అధీనంలో ఉంది. సమైక్య భారతదేశం లో జునాగఢ్ విలీనం అయిన తర్వాత అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలయ పునర్నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. 1951లో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం పూర్తి కాగా.. అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు.