27-07-2025 12:10:25 AM
బీజేపీ రాష్ర్ట ఆధికార ప్రతినిధి అమర్‌నాథ్
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): కేంద్రం నిధులిస్తున్నా చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించుకోలేకపోతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్‌నాథ్ విమర్శించారు. ప్రతిరోజూ మోదీ ప్రభుత్వా న్ని నిందిస్తున్న రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువింద గింజలా తన వైఫల్యాలను గుర్తించలేకపోతున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు.
వివిధ కేంద్ర పథకాల కింద ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వ బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్న రూ.2016 కోట్ల నిధులను వినియోగించుకోవడంలో విఫలమవుతున్న రేవంత్ రెడ్డి.. మోదీ ప్రభుత్వాన్ని నిందించడంలో ఏమాత్రం ఔచిత్యం లేదన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు కేంద్రంపై బట్టకాల్చి మీదేస్తున్న రేవంత్ రెడ్డి బండారాన్ని నిన్న విడుదలైన కాగ్ త్రైమాసిక నివేదిక బట్టబయలు చేసిందన్నారు. రాష్ర్ట ప్రభుత్వ ఆర్థిక వైఫల్యం, విపరీతమైన అవినీతి ఈ కాగ్ నివేదిక చూస్తే అర్థమవుతోందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల కేంద్ర పథకాల్లో రాష్ర్ట వాటా ఇవ్వనందు వల్ల తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ ఖాతాల్లో రూ.2016 కోట్లు మూలుగుతున్నాయని విమర్శించారు.