27-07-2025 12:12:39 AM
- ఇతర ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రసక్తి లేదు
- మేం ఇరకాటంలో పడ్డ ప్రతిసారి కాంగ్రెస్, బీజేపీ విలీనాన్ని తెరపైకి తెస్తాయి
- సీఎం రమేశ్ ఆరోపణలపై కేటీఆర్ కౌంటర్
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని, ఇతర ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రసక్తి లేదన్నారు. తమ పార్టీ ఇరకాటంలో పడ్డ ప్రతిసారి కాంగ్రెస్, బీజేపీ విలీనాన్ని తెరమీదకు తెస్తాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా జరగని కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1,660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ వచ్చిందని, ఇంతకన్నా దిగజారుడు రాజకీయం, దౌర్భాగ్యపు దందా ఇంకోటి ఉంటదా అని శనివారం నాడు ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్, ఎంపీ సీఎం రమేశ్ భాగోతాన్ని తాను బయటపెట్టడంతో కుడితిలో పడ్డ ఎలుకలా ఇద్దరూ కొట్టుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. ‘లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డట, దానికి రూ.1,660 కోట్ల కాంట్రాక్ట్ అట’ అని ఎద్దేవా చేశారు. హెచ్‌సీయూ భూములను తాకట్టుపెట్టి రూ.10 వేల కోట్లు దోచుకున్న పనికి సహకరించినందుకు ఒక రోడ్డును సృష్టించారని కేటీఆర్ ఆరోపించారు.
తాను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైందని, దొంగతనం బయటపడటంతో అటెన్షన్ డైవర్షన్‌కు పనికి రాని కథలు చెబుతున్నారని మండిపడ్డారు. నిబంధనలను తుంగలో తొక్కడం, కాంట్రాక్ట్‌ను అడ్డంగా అనుకున్న వాళ్లకు కట్టబెట్టడం మీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, మీ దోస్తు రూ.10 వేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు మీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ రూ.1,660 కోట్ల కాంట్రాక్ట్ అని తేలిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని, పసలేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ అని, ఇప్పుడే కాదు ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని, ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసనని కేటీఆర్ స్పష్టంచేశారు. సీఎం రమేశ్, ముఖ్యమంత్రి రేవంత్ ఇద్దరు కలిసి వస్తే రూ. 10 వేల కోట్ల హెచ్‌సీయూ భూముల స్కామ్‌పై, రూ.1,660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ స్కామ్‌పై కలిసి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.