calender_icon.png 21 January, 2026 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న ఖజానాకు కాసుల గలగల

21-01-2026 12:21:31 AM

గత ఏడాది కంటే రూ.14 లక్షలు అధికం 

పట్నం వారం బుకింగ్ ఆదాయం రూ.75 లక్షలు 

కొమురవెల్లి,జనవరి 20: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న కొమరవెల్లి మల్లన్న ఆలయానికి ఆదాయం భారీగా జమ అయ్యింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా పట్నం వారం సందర్భంగా ఆలయ బుకింగ్ ఆదాయం రూ. 75 లక్షల 81 వేల 241 రూపాయలు ఆదాయం లభించింది. పట్నం వారం సందర్భంగా భాగ్యనగరం నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఆదాయం కూడా అదే స్థాయిలో మల్లన్న ఖజానాకు వచ్చి చేరింది.

ఆదాయ ఆర్జనలో డీసీ కేటగిరీలో ఉన్న ఈ ఆలయం, ప్రతిఏటా ఆదాయం పెరుగుతూ వస్తుంది. అందులో భాగంగానే కిందటి ఏడాది కంటే ఈ ఏడాది రూ. 14 లక్షల రూపాయలు అధికంగా సమకూరింది. వివిధ ఆర్జిత సేవలు అయిన పట్నాల టికెట్లు, శీఘ్ర దర్శనం, విశిష్ట దర్శనం, వివిఐపి దర్శనం టికెట్ల ద్వారా, లడ్డు పులిహోర విక్రయాల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇవే సేవలకు గాను రూ. 61 లక్షల 81 వేల రెండు వందల58రూపాయలు ఆర్జించడం జరిగింది.

ప్రతి ఏటా ఆదాయం పెరుగుతున్నప్పటికీ గత ఏడాది మాత్రం గణనీయంగాతగ్గింది. అంతకుముందు  ముందు సంవత్సరంతో పోలిస్తే సుమారు రూ. 8 లక్షల ఆదాయం తగ్గింది. అంతకు( రెండు సంవత్సరాల క్రితం) ముందు సంవత్సరం ఆదాయం రూ. 70 లక్షల 22వేల 37 రూపాయలు ఆదాయం సమకూరింది. వివిధ ఆర్థిక సేవలు ద్వారా వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ఆలయ కార్యనిర్వాహ అధికారి టంకశాల వెంకటేష్ తెలిపారు.

22న హుండీ లెక్కింపు 

ఈనెల 22న కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండి లెక్కింపు జరపనున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి టంకశాల వెంకటేష్ తెలిపారు. ఈ హుండి లెక్కింపు ఆలయ ముఖమండపం లో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.