డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుండాలి
ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్
పాపన్నపేట, జూన్ 22: మాదక ద్రవ్యాలు, మత్తు క్షణిక ఆనందాన్ని ఇచ్చినా, జీవితాలను చిత్తు చేస్తుందని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ పిలుపు నిచ్చారు. సోమవారం పాపన్నపేట జూనియర్ కళాశాలలో స్థానిక తహసీల్దార్ సతీష్ తో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల బారిన పడితే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో పాటు కుటుంబాలు, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతాయఅన్నారు. సమాజంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు యువతే చైతన్య వంతులుగా మారి ఇతరులను కూడా అప్రమత్తం చేయాలని సూచించారు.
మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు నేరప్రవృత్తులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.‘మత్తు వద్దు నాన్న... జీవితం చిత్తవుతుంది కన్న‘ అనే నినాదంతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ, వాటి నిర్మూలనకు కృషి చేస్తామని విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






