దుబాయ్ వెళ్లేందుకు చోరీలు!
హనుమకొండ, మే 28 (విజయక్రాంతి): ఆ దొంగకు దుబాయ్ వెళ్లాలనే కోరిక, అంతేగాకుండా సొంతింటి కల కూడా ఉంది. ఇంకేముంది తనకు తెలిసిన చోరకళను ప్రదర్శించాడు. ఆరు జిల్లాల్లో వరుస దొంగ తనాలకు పాల్పడుతూ పోలీసులకు నిద్రలేకుండా చేశాడు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న వరంగల్ పోలీసులు ఎట్టకేలకు అంతర్ జిల్లా దొంగకు చెక్‌పెట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి సుమారు రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లు, రూ.50 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకెపల్లికి చెందిన జింక నాగరాజు బైక్ మెకానిక్ పనిచేస్తూ ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాలలో నివాసముంటున్నాడు. బైక్‌ల క్రయవిక్రయాలు కూడా చేసేవాడు.
జల్సాలకు అలవాటు పడిన నాగరాజు.. వచ్చే ఆదా యం సరిపోక దొంగ అవతారం ఎత్తాడు. 2011 నుంచి కరీంనగర్, జమ్మికుంట, కామారెడ్డి, సిద్దిపేట, వేములవాడ తదితర ప్రాంతాల్లో బైక్‌లు దొంగిలించి విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలు జీవితం గడిపాడు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత తన ప్రవర్తనలో మార్పురాకపోగా తిరిగి చోరీలకు పాల్పడ్డాడు. అనంతరం బైక్ చోరీలకు స్వస్తి చెప్పి తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేసేవాడు. 2016 నుంచి 2022 వరకు జనగామ, సిద్దిపేట, భూపాలపల్లి జిల్లాలో మొత్తం 38కి పైగా ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
సొంతిల్లు, దుబాయ్ వెళ్లేందుకు..
నిరుడు మార్చిలో జైలు నుంచి విడుదలైన నాగరాజు.. సొంతిల్లు నిర్మాణంతో పాటు దుబాయ్ వెళ్లి సెటిల్ అయ్యేందుకు సరిపడా డబ్బు కోసం దొంగతనాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. వరంగల్, హనుమకొండ, జనగామ, జగిత్యాల, యాదాద్రి జిల్లాలో మొత్తం 20 చోరీలకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన వరంగల్ పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. మంగళవారం నిందితుడు చోరీ చేసిన బంగారు ఆభరణాలు అమ్మేందుకు బైక్‌పై వెళ్తున్నాడనే సమాచారం మేరకు మట్వాడ, సీసీఎస్ పోలీసులు వరంగల్ ఆర్‌ఎన్‌టీ రోడ్‌లో తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డాడు. నిందితుడిని తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు లభించాయి. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీపీ వెల్లడించారు. దొంగను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ట్రైనీ ఐపీఎస్ శుభం నాగ్‌తోపాటు సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ, అడిషనల్ డీసీపీ రవి, వరంగల్ ఏసీపీ నందిరామ్‌నాయక్, ఇతర పోలీసులను ఆయన అభినందించారు.






