27-04-2025 12:00:00 AM
వాస్తవానికి వరకట్న వేధింపులు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్‌లో 498ఎ కేసును పెడతారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా కేసుల్లో కుటుంబ సభ్యులందరినీ ఇరికించే సంఘటనలు ఎక్కువయ్యాయి. 498ఎ లేదా గృహహింస చట్టం కింద ఫిర్యాదు ఇచ్చినప్పుడు పోలీసులు విచారణ చేసి కేసు రిజిస్టర్ చేయాలి. అందుకోసం వారు సీఆర్‌పీసీ 41(ఎ) కింద నోటీసు ఇచ్చి ఇరు వర్గాలను కూర్చోబెట్టి నిజానిజాలు తేలుస్తారు.
అక్కడే చాలా కేసులు సెటిల్ అవుతాయి. లేదంటే అప్పుడు కోర్టుకి వెళ్తాయి. అంటే దానర్థం వరకట్న వేధింపుల కింద కేసు రిజిస్టర్ అయ్యిందని చెప్పొచ్చు. అప్పుడు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తీసుకోవడమో, అరెస్ట్ అయ్యాక రెగ్యులర్ బెయిల్ తీసుకోవడమో జరుగుతుంది. ఒకసారి కోర్టుకి కేసు చేరాక పోలీస్ స్టేషన్‌లో కేసు విత్ డ్రా చేసుకుంటున్నామని రాసిస్తే సరిపోదు.
కోర్టులోను ఆ విషయం చెప్పాలి. అసలు ఈ కేసు ఇన్నాళ్లు ఎందుకు కోర్టులో పెండింగ్ ఉండిపోయిందో తెలియదు. సాధారణంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కేసు విత్ డ్రా అవుతుంది. అది అమ్మాయి ద్వారానే జరగాలి. ఆ అమ్మాయి తరపున వారికి ఈ విషయాన్ని పెద్ద మనుషుల సాయంతో తెలియజేయాలి.
స్టేషన్‌లోనే రాజీ పడ్డ విషయాన్ని కోర్టుకి లాయర్ ద్వారా చెప్పాలి. ఆ అమ్మాయి రాసిన లేఖను కోర్టులో చూపించి. ఇక కోర్టులో హాజరు కావాల్సిన అవసరం లేకుండా డిస్పెన్స్ విత్ పిటిషన్ వేయించాలి. కోర్టులో రాజీ అయ్యాక పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడటానికి రెండు మూడు నెలల సమయం పడుతుంది. అధైర్యపడకుండా. ముం దు ఓ మంచి లాయర్‌ని సంప్రదించి.. సలహాలు తీసుకుంటే సరిపోతుంది.
రమ్య కుమారి ఆకుల హైకోర్టు అడ్వకేట్, సామాజిక కార్యకర్త