calender_icon.png 19 January, 2026 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం నియంత్రణలో రాజీపడే ప్రసక్తే లేదు

19-01-2026 12:35:52 AM

  1. ఉదయం నుండి తాగే విధానానికి స్వస్తి పలికాలి...
  2. వ్యాపారం కోసం ప్రజల ఆరోగ్యాలు పాడు చేయొద్దు
  3. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు, జనవరి 18 :  మునుగోడు నియోజకవర్గంలో కొనసాగుతున్న మద్యం షాపుల సమయపాలన లో రాజీ పడే ప్రసక్తే లేదని  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  అన్నారు.మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో  ఎమ్మెల్యే  కలవడానికి వచ్చిన కొంతమంది మద్యం వ్యాపారులతో  మద్యం షాపుల సమయపాలన పై మధ్య నియంత్రణపై  వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. వ్యాపారాల కోసం ప్రజల ఆరోగ్యాలు పాడుచేయొద్దని హెచ్చరించారు.ఉదయం నుండి మద్యం తాగే విధానానికి స్వస్తి పలికేలా మద్యం వ్యాపారులు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని హితవు పలికారు.

నియోజకవర్గంలో మద్యం షాపుల విషయంలో తాను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్ షాపులు తెరుచుకోవాలని 6 గంటల తర్వాతే పర్మిట్ రూముల్లో అనుమతి ఉండాలని అన్నారు.. అవసరమైతే నియోజకవర్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను ఇంకా పెంచుతామని, ఉదయమంతా పనిచేసుకొని సాయంత్రం పూట మాత్రమే తాగేలా మార్పు తీసుకొస్తున్నామన్నారు. మద్యం విషయంలో  తాము తీసుకొస్తున్న ఈ మార్పుకు ఇతర నియోజకవర్గాల నుండి మంచి నిర్ణయం అవలంబిస్తున్నారని  ఫోన్లు వస్తున్నాయని  తెలిపారు..

మద్యం విచ్చలవిడిగా లభ్యం అవ్వడం వల్ల పనులు మానేసుకొని  అదేపనిగా తాగుతూ చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుందని, యువత మద్యానికి బానిసై పెడదొవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.యువత ఆలోచనలు మద్యం వైపు నుండి తమ వ్యక్తిగత అభివృద్ధి వైపు మళ్లిస్తూ గ్రామాలలో ఆరోగ్యకరమైన వాతావరణ నెలకొల్పడానికే ఈ ప్రయత్నం అన్నారు.ఎట్టి పరిస్థితులలో మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపుల సమయపాలనలోనూ మద్యం నియంత్రణ విషయంలోనూ రాజీ పడే ప్రసక్తే లేదని మద్యం వ్యాపారులకు చెప్పారు.