calender_icon.png 16 July, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్ల ప్రాజెక్టుకు అవకాశమే లేదు

16-07-2025 12:21:58 AM

  1. వరద జలాలు ఎడారిలో ఒయాసిస్సు లాంటివి
  2. వరద జలాలను నమ్ముకుని ఏ ప్రాజెక్టును నిర్మించలేదు
  3. వృథాగా పోయే నీటిపై అన్ని భాగస్వామ్య రాష్ట్రాలకు హక్కు
  4. రాష్ట్రాల అనుమతి లేకుండా నదుల అనుసంధానం అసాధ్యం 
  5. పీపీటీలో కేంద్ర జల్‌శక్తి మాజీ సలహాదారు వెదిరే శ్రీరాం 

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి నదీ జలాల చట్టాలు, నిబంధనలు అంగీకరించబోవని, ఇది ముమ్మాటికీ సరైన ప్రాజెక్టు కాబోదని కేంద్ర జల్‌శక్తి మాజీ సలహాదారు వెదిరే శ్రీరాం స్పష్టం చేశారు. వరదల జలాలు వృథాగా పోతున్నాయనే సాకు చూపిస్తూ ప్రాజెక్టులు కడతామని పేర్కొనడాన్ని ఆయన కొట్టి పారేశారు.

గోదావరి జలాల వివాదం- వాస్తవాల పరిశీలన పేరిట తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం లక్డీకాపూల్‌లోని హోటల్ అశోకాలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో ఇప్పటివరకు వరద జలాలను నమ్ముకుని ఏ ఒక్క ప్రాజెక్టును కూడా నిర్మించలేదని స్పష్టం చేశారు. వరద జలాలు అనేవి కేవలం ఎడారిలో ఒయాసిస్సు లాంటివని వివరించారు.

సముద్రంలో కలుస్తున్న నీటిపై తమకే హక్కుందని ఏపీ పేర్కొనడం సరికాదన్నారు. రాష్ట్రాల అనుమతి లేకుండా కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నదుల అనుసంధానం చేపట్టేందుకు అవకాశమే లేదని పేర్కొన్నారు. నదుల అనుసంధానం చేస్తే కనీసం ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు ప్రయోజనం కలగాలని, కానీ బనకచర్ల ప్రారంభం మరియు ముగింపు కూడా ఏపీలోనే ఉందన్నారు. 

నిబంధనలు అంగీకరించవు

పోలవరం నుంచి ఏటా 3వేల టీఎంసీలు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయని, ఆ నీటినే తాము బనకచర్లకు మళ్లిస్తామంటూ ఏపీ పేర్కొనడం కరెక్టు కాదని శ్రీరాం పేర్కొన్నారు. వాస్తవంగా పోలవరం నుంచి సముద్రంలో కలిసే నీటిని సీడబ్ల్యూసీ లెక్కిస్తే సగటున 1,138 టీఎంసీలుగా మాత్రమే తేలిందన్నారు. అయితే ఈ నీటిపై కేవలం ఏపీకి మాత్రమే గంపగుత్తగా హక్కు ఉండబోదని, కో-బేసిన్ రాష్ట్రాలన్నింటికీ ఈ నీటిపై హక్కులు ఉంటాయన్నారు.

ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన నికర జలాలను వివిధ కారణాల చేత పూర్తిగా వాడుకోవడం లేదని, కానీ ఏపీ మాత్రం తనకు గోదావరిలో కేటాయించిన 531.9 టీఎంసీలను వంద శాతం వాడుకుందని తెలిపారు. తెలంగాణకు ఉన్న కేటాయింపులైన 968 టీఎంసీలలో ఇంకా చాలా నీటిని వాడుకోవడం లేదని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన ప్రాజెక్టులు   పూర్తి కాకపోవడం వల్ల ఆ నీరు దిగువనకు పోతోందని, అంతమాత్రాన ఆ నీరు తనకే దక్కాలని ఏపీ అనడం కరెక్ట్ కాదన్నారు.

భవిష్యత్తులో ఎగువ రాష్ట్రాలన్నీ తమకు కేటాయించిన నీటి లెక్కల ప్రకారం ప్రాజెక్టులు నిర్మిస్తే బనకచర్లకు కేటాయించే రూ. 1.50 లక్షల కోట్లు వృథాగా మారుతాయని హెచ్చరించారు. ప్రాజెక్టు నిర్మించుకున్నాం కాబట్టి తమకు నీటిని వదలాలని ఏపీ డిమాండ్ చేసేందుకు కూడా అవకాశం ఉందన్నారు. అయితే వరద జలాల ఆధారంగా సీడబ్ల్యూసీ ఎప్పటికీ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆమోదం తెలపబోదని ఇప్పటికే ఆ విషయాన్ని ఏపీకి స్పష్టం చేసిందన్నారు. 

ఇచ్చంపల్లి-గోదావరి-కావేరి లింకే ప్రత్యామ్నాయం

వరద జలాలపై ఆధారపడే బనకచర్ల కన్నా తెలంగాణ పరిధిలో నిర్మించే ఇచ్చంపల్లి-గోదావరి- కావేరీ లింక్ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని వెదిరే శ్రీరాం తెలిపారు. ఇందుకు కేంద్రం నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉందన్నారు. చత్తీస్‌గఢ్ వాడకుండా కిందికి వదిలేస్తున్న గోదావరి మిగులు జలాలను ఈ ఇచ్చంపల్లి లింక్ ప్రాజెక్టుకు కేటాయింపచేసేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.

చత్తీస్‌గఢ్‌కు ఇందుకు ప్రతిఫలంగా ప్యాకేజీని అందించేదుకు కూడా కేంద్రం ఒప్పుకుంటుందన్నారు. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్‌కు తరలించి... అక్కడి నుంచి ఏపీ, కర్ణాటక, తమిళనాడుకు గోదావరి నీటిని తరలించవచ్చని.. ఇందుకు బనకచర్ల-గోదావరి లింక్ ప్రాజెక్టుతో పోలిస్తే చాలా తక్కువ (రూ. 50వేల కోట్లు) ఖర్చు అవుతుందని వివరించారు. ఇచ్చంపల్లి లింక్ ప్రాజెక్టుకు ఏపీ, తెలంగాణ ఒప్పుకుంటే చత్తీస్‌గఢ్‌ను ఒప్పించడం చాలా తేలిక అని అన్నారు.

ఇచ్చంపల్లి బ్యాక్ వాటర్ వల్ల కాళేశ్వరం, మేడిగడ్డ, సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. అంతేకానీ బనకచర్ల కడతాం.. వరద నీరు వస్తే వాడతాం.. లేదంటే ఊరుకుంటామనే ఏపీ వాదనలో పసలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీ ప్రతిపాదనలకు సీడబ్ల్యూసీ, జీఆర్‌ఎంబీ, పోలవరం అథారిటీ, పర్యావరణ శాఖ అంగీకరించలేదని గుర్తు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కప్పర ప్రసాద్‌రావు పాల్గొన్నారు.