అభివృద్ధిలో రాజీపడేది లేదు
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 25 (విజయక్రాంతి): నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదని, రాబోయే ఐదేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి చూపిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. అకాల వర్షాలతో గండ్లు పడి తెగిన 124 చెరువులకు రూ.51 కోట్లతో మరమ్మతులు చేసినట్టు వివరించారు.
మొరాంచ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతులు రాగానే ప్రారంభిస్తామన్నారు. బాగిర్తిపేట ఆర్చీ నుంచి కొడవటంచ రోడ్డుకు రూ.35 కోట్లతో త్వరలో రోడ్డు నిర్మాణపనులు మొదలు పెడ్తామని, శాయంపేట మొగుళ్లపల్లి మండలాలకు రెండు అంబులెన్స్‌లు అందించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి రూ.30లక్షలు కేటాయిస్తానని చెప్పారు. వారం రోజుల్లో 430 ఇండ్లను నిరుపేదలకు పంపిణీ చేస్తామని స్పష్టంచేశారు. మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో జిల్లాలో వంద ఎకరాలు కేటాయించి ఇండస్త్రీయల్ పార్క్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.






