calender_icon.png 10 December, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల సందడి లేదు

08-12-2025 01:24:19 AM

  1. జిల్లాలో అమలులో లేని నియమావళి 
  2. పంచాయతీలు లేకపోవడమే కారణం 
  3. తాజాగా జిహెచ్‌ఎంసిలో విలీనం 
  4. స్థానిక నేతలలో అసహనం

మేడ్చల్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఎన్నికల కోలాహలం నెలకొనగా మేడ్చల్ జిల్లాలో మాత్రం రాజకీయ నిశ్శబ్దం ఏర్పడింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఆశావహులు ఉత్సాహంగా బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, మేడ్చల్ జిల్లా నాయకులు నిరుత్సాహంతో ఉన్నారు. మేడ్చల్ హైదరాబాదు జిల్లాల్లో పంచాయతీలు లేనందున ఎన్నికల సందడి లేదు. ఎన్నికల నియమావళి కూడా అమలులో లేదు. జిల్లాలో గతంలో 61 గ్రామపంచాయతీలు, ఐదు మండలాలు ఉండేవి.

వీటన్నింటినీ సమీప మున్సిపాలిటీలలో విలీనం చేశారు. కొత్తగా మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. తాజాగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల, ఆనుకుని ఉన్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేశారు. దీంతో జిల్లాలోని నిజాంపేట్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లు, మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, దుండిగల్, కొంపల్లి, తూముకుంట, ద్మగూడ, నాగారం, ఘటకేసర్, పోచారం మున్సిపాలిటీలు జిహెచ్‌ఎంసి లో విలీనమయ్యాయి. కొత్తగా ఏర్పడిన ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు మాత్రమే మిగిలాయి. 

విలీనంతో తగ్గనున్న పదవులు 

రాజకీయ నాయకులుగా ఎదగడానికి వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, పట్టణాలలో కౌన్సిలర్ పదవులు తొలిమెట్టుగా భావిస్తారు.  స్థానిక సంస్థల వల్ల అనేకమందికి పదవులు లభిస్తాయి. జి హెచ్ ఎం సి లో మున్సిపాలిటీలు విలీనం వల్ల ఆశావహుల అవకాశాల మీద దెబ్బ పడింది. గతంలో ఒక మునిసిపాలిటీలో 30 వార్డులు ఉండటం వల్ల 30 మందికి పదవులు లభించేవి.

అదనంగా కో ఆప్షన్ పదవులు కూడా వచ్చేవి. కానీ గ్రేటర్ హైదరాబాదులో విలీనంతో కేవలం ఇద్దరు ముగ్గురికి మాత్రమే పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. కిందిస్థాయి వారికి పదవులు వచ్చే అవకాశం ఉండదు. డబ్బున్న వారికి మాత్రమే పోటీ చేయడానికి అవకాశం దక్కుతుంది. 

రాజకీయ నేతల్లో తీవ్ర అసహనం 

ప్రస్తుత తాజా పరిస్థితుల్లో రాజకీయ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, జిహెచ్‌ఎంసిలో మున్సిపాలిటీలు విలీనం ఒకేసారి జరగడంతో రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్‌ఎంసిలో, మున్సిపాలిటీలలో తమ గ్రామాలను విలీనం చేయకుంటే ప్రస్తుతం తమ గ్రామాలలో కూడా ఎన్నికల సందడి ఉండేదని ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

పంచాయతీలు, పరిషత్తులు, మున్సిపాలిటీలు రద్దుచేసి తమ అవకాశాలను ప్రభుత్వం దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలను జిహెచ్‌ఎంసిలో విలీనంతో ఒరిగేదేమీ లేదని అంటున్నారు.