01-01-2026 12:00:00 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 31 : ఈ ఏడాది మే నెలలో భారత్-పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తలను తగ్గించడానికి మూడో పక్షం ప్రమేయమే లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం మహించామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యి తాజాగా బీజింగ్‌లో జరిగిన ఒక సదస్సులో చెప్పారు. ఒక్క భారత్--పాక్ మాత్రమే కాదు.. ఇరాన్, పాలస్తీనా-ఇజ్రాయెల్, మయన్మార్ వివాదా ల్లోనూ తాము జోక్యం చేసుకుని శాంతిని నెలకొల్పామని చెప్పుకొచ్చారు.
అయితే.. చైనా వ్యాఖ్యలను కేంద్ర విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. మధ్యవర్తిత్వం విషయంలో భారత్ ఎప్పటి నుంచో స్పష్టమైన వైఖరిని అవలంబిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆపరేషన్ సిందూర్‌పై ఎవ రూ మధ్యవర్తిత్వం వహించలేదు. పాకిస్థాన్ సైనిక అధికారులు (డీజీఎంఓ) మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమే. ఇందులో ఎవ రూ మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేదని స్ప ష్టం చేసింది.
చైనాది ‘ద్వంద్వ నీతి’
పాకిస్థాన్‌తో ఉన్న సమస్యలను కేవలం ద్వైపాక్షికంగా మాత్రమే పరిష్కరించుకుంటామని.. మధ్యవర్తిత్వం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని కేంద్రం పునరుద్ఘాటించింది. చైనా ఓ వైపు శాంతి నెలకొల్పాలని చెబుతూనే, మరోవైపు పాకిస్థాన్‌కు సైనిక సహాయం, నిఘా సమాచారాన్ని అందిస్తూ ‘ద్వంద్వ నీతి’ ప్రదర్శించిందని భారత అధికారులు తీవ్రంగా విమర్శించారు. గతంలో మధ్యవర్తిత్వం గురించి ట్రంప్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దానికి ప్రధాని నరేంద్ర మోదీ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.