calender_icon.png 23 November, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందువులు లేకుండా ప్రపంచమే లేదు!

23-11-2025 12:55:10 AM

  1. కాలగర్భంలోకి గ్రీస్, ఈజిప్ట్, రోమ్ నాగరికతలు
  2. భారత నాగరికత మాత్రం అజరామరం
  3. ఎన్నో దండయాత్రలు తట్టుకుని నిలబడింది..
  4. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ఇంఫాల్, నవంబర్ 22: ‘హిందువులు లేకపోతే ప్రపంచమే లేదు. గ్రీస్ (యూనాన్), ఈజిప్ట్ (మిసార్), రోమ్ వంటి అనేక పురాతన నాగరికతలు కాలక్రమేణా అంతరించి కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ, ఇప్పటికీ భారత నాగరికత మాత్రమ చెక్కు చెదరలేదు. ఈ నాగరికత అజరామరం. ప్రపంచంలోని ప్రతి దేశం అన్ని రకాల పరిస్థితులను చూసింది. హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ఉనికి ఉండదు’ అని రాష్ట్రీయ స్వయం సేవక్  సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహ న్ భగవత్ పేర్కొన్నారు.

హిందూ సంస్థ లు సృష్టించిన సమాజ వ్యవస్థలు ఏళ్లు గడుస్తున్నా పటిష్టంగా ఉన్నాయని కొనియాడారు. జాతుల మధ్య ఘర్షణలు జరి గిన తర్వాత మణిపూర్‌లో తొలిసారి ఆయన మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శని వారం ఆయన ఇంఫాల్‌లో వివిధ ఆదివాసీ సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. రామాయణం, మహాభారతంతోపాటు కాళిదాసు సాహిత్యంలో మణిపూర్ ప్రస్తావన ఉందని గుర్తుచేశారు.

ఆయా పురాణ గ్రంథాల్లో మణిపూర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్న భూభాగం ‘భారత్‌వర్శ్’ (అఖండ భారత్) అని రాసి ఉందని వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్ ఎలాంటి రాజకీయాల్లో పాలుపంచుకోదని, ఏ సంస్థను కూడా తన నియంత్రణలో పెట్టుకోదని స్పష్టం చేశారు. భారత్‌పై ఎన్ని దండయాత్రలు జరిగినా ఎప్పుడూ ఒక్కటిగానే ఉందన్నారు. మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలంటే ప్రజల మధ్య ఐక్యత అవసరమని అభిప్రాయపడ్డారు.

ఒక కుటుంబంలో తలెత్తిన సమస్యలను కుటుంబంలోనే పరిష్కరించునే విధంగా మణిపూర్ లోనూ జరగాలని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిధిలోనే ఆ సమస్యలకు పరిష్కారం లభించాలని ఆకాంక్షించారు. శాంతి స్థాపన ఒక్క రోజులో సాధ్యపడదని, అందుకు ఎంతో ఓపిక కావాలని, సామూహిక కృషి, క్రమశిక్షణ కూడా అవసరమని అభిప్రాయపడ్డారు.

అమెరికా ఎడాపెడా భారత్‌పై సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారన్నారు. దేశం ఆర్థికస్వావలంబన సాధించాలంటే  ప్రజల సహకారం అవసరమని, భారతీయులంతా స్వదేశీ వస్తువులను వినియోగించాలని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఎవరిపైనా ఆధారపడకూడదని భగవత్ అన్నారు.