19-04-2025 12:23:39 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం ఘటనలో పోలీసులకు కొత్త ట్విస్ట్ ఎదురైంది. మార్చి 23న జరిగిన ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. బాధిత యువతిపై లైంగికదాడికి యత్నం జరగలేదని నిర్ధారించినట్లు తెలుస్తోంది.
రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడ్డానని సదరు యువతి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తున్నది. అనంతపురానికి చెందిన ఓ యువతి మేడ్చల్‌లోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ మార్చి 23న సికింద్రాబాద్‌కు వెళ్లి తిరిగి మేడ్చల్‌కు ఎంఎంటీఎస్ రైలులో బయలుదేరింది. ఈ క్రమంలోనే రైలు నుంచి పడిపోవడంతో స్థానికులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కాగా ఓ యువకుడు తనపై లైంగిక దాడికి యత్నించాడని ఆ యువతి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. దీంతో పోలీసులు దాదాపు 250కిపైగా సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. 100మందికి పైగా అనుమానితులను ప్రశ్నించారు. అయినప్పటికీ లైంగికదాడి యత్నం జరిగిందనే ఆధారాలు లభించలేదు. సదరు యువతినే పోలీసులు లోతుగా ప్రశ్నించడంతో అసలు విషయం తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.
రైలులో రీల్స్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పడిపోయినట్లు ఆ యువతి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిస్తే తనను తప్పుపడతారనే భయంతో లైంగికదాడికి యత్నం జరిగిందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు న్యాయసలహాలు తీసుకుని కేసు క్లోజ్ చేసినట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగడం గమనార్హం.
లోబర్చుకునే యత్నం చేశాడు..
గుర్తుతెలియని వ్యక్తి తనను లోబర్చుకునే ప్రయత్నం చేశాడని సదరు యువతి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. “మేడ్చల్ నుంచి సికింద్రాబాద్‌కు ఫోన్ డిస్‌ప్లే వేయించుకునేందుకు వెళ్లాను. తిరుగు ప్రయాణంలో రెండు ట్రైన్లు మిస్ అయ్యాయి. మరో ట్రైన్ ఎక్కాను. గుర్తుతెలియని యువతులు బోగీలో ఉన్నారు. వారు అల్వాల్‌లో దిగిపోయారు. ఆ తర్వాత ఓ గుర్తు తెలియని యువకుడు ఉన్నట్లు చూశాను.
అతను నా దగ్గరకు వచ్చి, నన్ను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. నన్ను గట్టిగా పట్టుకున్నాడు. తర్వాత స్టాప్‌లో నా రూం ఉంటుందని అతనికి చెప్పా. అప్పుడు అతను వదిలివేయడంతో ట్రైన్‌లో నుంచి దూకేశా. నాకు స్నాప్ పిచ్చి ఉంది. ఎక్కడికి వెళ్లినా స్నాప్ తీసుకుంటా.
కానీ రీల్స్ పిచ్చి లేదు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే సమయంలో నా దగ్గర ఉన్న మరో ఫోన్‌తో సెల్ఫీ తీసుకున్నా. కానీ సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్లే సమయంలో ఫొటో తీసుకోలేదు.’ అని సదరు యువతి తెలిపింది.