calender_icon.png 25 December, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీ భారీ పెట్టుబడులు

26-06-2024 12:05:00 AM

  • పునరుత్పాదక ఇంధన విస్తరణకు రూ.2 లక్షల కోట్లు

అహ్మదాబాద్, జూన్ 25: అదానీ గ్రూప్ 40 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి 2030కల్లా రూ. 2 లక్షల కోట్లు పెట్టుబడి చేయాలని యోచిస్తున్నది. 2050కల్లా నికర జీరో ఎమిషన్స్ సాధించాలన్నది లక్ష్యమని మంగళవారం అదానీ గ్రూప్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గౌతమ్ అదానీ గ్రూప్ రెన్యువబుల్ విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 10 గిగావాట్ల మేర ఉన్నది. ఒక మెగావాట్ ఉత్పాదక సామర్థ్యం ఏర్పాటుకు రూ.5 కోట్లు వ్యయం అవుతుందని, ఈ మేరకు 2030నాటికి తమ పెట్టుబడులు రూ. 2 లక్షల కోట్ల వరకూ ఉంటాయని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ మీడియాకు చెప్పారు.

సూర్యకాంతి లభించని రాత్రి సమయాల్లో, గాలులు అధికంగా లేనపుడు విండ్ టర్బైన్లు విద్యుత్ సరఫరా చేయలేని సమయాల్లో విద్యుత్ డిమాండ్‌ను అందుకునేందుకు 5 గిగావాట్ల పంప్ స్టోరేజీ సదుపాయాన్ని కంపెనీ నెలకొల్పుతుందని సీఈవో అమిత్ సింగ్ వెల్లడించారు.2023 అదానీ గ్రీన్ ఎనర్జీ 2.8 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని నెలకొల్పిందని, ఈ ఏడాది 6 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని సింగ్ వివరించారు. 2030నాటికల్లా తమ మొత్తం 50 గిగావాట్ల సామర్థ్యంలో సౌర విద్యుత్ 80 శాతం ఉంటుందని, 20 శాతం పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు.

ప్రస్తుత ఏడాది గ్రూప్ కంపెనీల్లో రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడి

అదానీ గ్రూప్ తన వివిధ వ్యాపారాల్లో ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.3 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వచ్చే ఏడు నుంచి పదేండ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి చేస్తామన్న గైడెన్స్‌లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తమ పోర్టులు, ఎనర్జీ, ఎయిర్‌పోర్టులు, కమోడిటీస్, సిమెంట్, మీడియా వ్యాపారాల్లో రూ. 1.3 లక్షల కోటు ఇన్వెస్ట్ చేస్తామని గ్రూప్ సీఎఫ్‌వో జుగేషిందర్ రాబీ సింగ్ తెలిపారు.  ప్రతిపాదత పెట్టుబడిలో 70 శాతం అంతర్గత వనరుల ద్వారా సమీకరించుకుంటా మని, మిగిలిన మొత్తానికి రుణాలు తీసుకుంటామన్నారు.

ఈ ఏడాది మెచ్యూర్‌కానున్న 34 బిలియన్ డాలర్ల రుణాన్ని రీఫైనాన్స్ చేసేందుకు, 1 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ కోసం గ్రూప్ అన్వేషిస్తున్నదని, కొత్త ఇన్వెస్టర్లను తీసుకురావడం ద్వారా 22.5 బిలియన్ డాలర్ల వార్షిక ఈక్విటీ పెట్టుబడుల్ని సేకరిస్తామన్నారు. 2023 అదానీ గ్రూప్ కంపెనీల పన్నుకు ముందస్తు లాభం 45 శాతం వృద్ధిచెంది రూ.82,917 కోట్లకు (10 బిలియన్ డాలర్లు) చేరిందని సీఎఫ్‌వో వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో స్టోరేజ్ ప్రాజెక్టులు

అదానీ గ్రీన్ ప్రస్తుతం గుజరాత్‌లోని ఖవ్డా వద్ద ఏర్పాటుచేస్తున్న 30,000 మెగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ప్రపంచంలోనే అదిపెద్ద విద్యుత్ ప్రాజెక్టు అని సింగ్ తెలిపారు. 538 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది నెలకొల్పుతున్నామని, 2023 ఆర్థిక సంవత్సరంలో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని, తొలిదశలో కనీసం 3,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు (పీఎస్‌పీ) సామర్థ్యాన్ని నెలకొల్పుతామని వెల్లడించా రు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 500 మెగావాట్ల పీఎస్‌పీ నిర్మాణాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.