17 May, 2026 | 7:47 AM

‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టులను కాల్చిచంపుతున్నరు

21-06-2024 12:10 AM

బీజేపీ ప్రభుత్వం సహజ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతోంది

సీపీఐ (ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి కార్యదర్శి ప్రభాకర్

సిద్దిపేట రూరల్, జూన్ 20: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో వందలాది మంది మావోయిస్టులను కాల్చిచంపుతోందని సీపీఐ(ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి పార్టీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ ఆరోపించారు. గురువారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. దండకారణ్యంలో ఉన్న అపారమైన ఖనిజ, సహజ సంపదను దోచుకోవడానికి.. అడవికి, ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టులను ఏరివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెడుతోందని ఆరోపించారు. ఆదివాసీ, మైనార్టీ, క్రిస్టియన్లపై ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, బీజేపీ శ్రేణులు దాడులు చేస్తూ ఒకే దేశం, ఒకే చట్టం పేరుతో ప్రజా హక్కులను తుంగలో తొక్కుతుందన్నారు. ఇలాంటి విధ్వంస, అభివృద్ధి నిరోధక, దళారీ, దోపిడీ పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో సంపంగి పద్మక్క, లెనిన్, నర్సింహులు పాల్గొన్నారు.