24-12-2025 12:00:00 AM
భూ మాఫియాదారుల నుంచి రక్షణ కల్పించాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆదివాసీల నిరసన
ఆదిలాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాం తి): తమను అవమాన పరుస్తూ, కులం పేరు తో దూషించడమే కాకుండా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న భూ మాఫియా దారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదివాసీ లు ఆందోళనకు దిగారు. ఆదివాసీల హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎత్తున ధర్నా చేపట్టారు. మావల మండలంలోని కొమరం భీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసీ లు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు ర్యాలీగా తరలివచ్చారు.
అనంతరం కార్యాలయ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ...రాత్రి సమయంలో కాలనీకి వచ్చి గుడి సెలు వేసుకున్న స్థలాన్ని ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులైన కళ్లెం భుమారెడ్డి, తిప్ప నారాయణ, డేవిడ్, సురేష్ అగర్వాల్, మల్లేష్, మరో ప్రముఖ న్యాయవాది లపై 302, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
రియల్ మాఫీయదారులు రాత్రి వేళల్లో వచ్చి దుర్భాశలడటంతో పాటు మీ సంగతి చూస్తాం, ఈ భూమి మాదే రేపో మాపో ఇక్కడి నుంచి వెళ్లి పోవాలి లేదంటే మీ సంగతి మీ నాయకుల సంగతి ఏదో చూస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా బెదిరించారనీ జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను రక్షించి ఆదివాసులు నివసిస్తున్న ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చి, నీళ్లు, కరెంటు, విద్య, వైద్యం, రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో తుడం దెబ్బ జిల్లా అధ్యక్షులు పెందుర్ దాది రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉయిక ఇందిర, ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పేందుర్ సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం వరుణ్, పెద్దఎత్తున ఆదివాసీలు పాల్గొన్నారు.