19-05-2024 01:29:26 AM
ఇమారత్, మామిడిపల్లి అటవీ భూములపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): అటవీ భూమిని ఇతర అవసరాలకు ప్రభుత్వం కేటాయించే విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమారత్‌కంచ, సరూర్‌నగర్ మండలం మామిడిపల్లిలో 6,648 ఎకరాల అటవీ భూములకు సంబంధించిన అంశంలో ఈ తీర్పునిచ్చింది. 1956లో నిజాం నుంచి ఇమారత్‌కంచలో 4,067 ఎకరాలు, మామిడిపల్లిలో 2,400 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇమారత్‌కంచలోని 4,076 ఎకరాలను 1966లో మిస్సైల్ పరీక్షల నిమిత్తం డిఫెన్స్‌కు లీజుకు ఇవ్వగా, మరో 4,067 ఎకరాలు మామిడిపల్లిలో గొర్రెల పెంపక క్షేత్రం కోసం 1972లో పశుసంవర్ధకశాఖకు అప్పగించారు.
అటవీ సంరక్షణ చట్టం ముందు జరిగిన కేటాయింపులను డీనోటిఫై చేయడానికి కేంద్రం అనుమతులు అవసరం లేదంటూ పేర్కొంది. అటవీ భూములను డీనోటిఫై చేయకుండా ఇతరత్రా అవసరాలకు వాడుకోవద్దని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అనే ఎన్‌జీఓ 2009లో దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. తీర్పులో నిజాం నుంచి అటవీ శాఖ కొనుగోలు చేసిన భూములను రిజర్వు ఫారెస్ట్‌గా నోటిఫై చేయలేదని హైకోర్టు పేర్కొంది. ప్రైవేటు కంపెనీలు కూడా భూమిని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశాయని వెల్లడించింది.
ఈసీ నగదు సీజ్ చేయొచ్చు: హైకోర్టు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మిర్యాలగూడ నుంచి నల్లగొండ వెళుతున్న వాహనంలో రూ.3.04 కోట్ల నగదు తరలింపుపై నమోదైన కేసును కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. మాడుగుల పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయడంతోపాటు పోలీసులు సీజ్ చేసిన నగదును విడుదల చేయాలంటూ సికింద్రాబాద్‌కు చెందిన నీనా కమలేశ్ షా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. డబ్బు తరలించిన వాహనంలో ఉన్న డ్రైవర్ విపుల్‌కుమార్, అమర్‌సిన్హాపై పోలీసులు కేసు నమోదు చేసి నగదును ఆదాయ పన్ను శాఖకు అప్పగించామని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.
ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినా నగదు యజమానులు స్పందించలేదన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టడానికి ఎన్నికల సంఘానికి అధికారాలున్నాయన్నారు. ఇక్కడ కేసులో సీజ్ చేసిన నగదుకు తగిన ఆధారాలు చూపలేదని, పోలీసులు నమోదు చేసిన కేసులో పిటిషనర్ నిందితుడు కాదంటూ ఇందులో జోక్యం చేసుకోలేమని పిటిషన్‌ను కొట్టివేశారు.