01-01-2026 12:09:44 AM
అనారోగ్య కారణాలతో.. భార్యాభర్తల ఆత్మహత్య
బచ్చన్నపేట, డిసెంబర్ 31 (విజయక్రాంతి): వివాహ సమయంలో సప్తపదిలో బతికినంతకాలం కలిసిమెలిసి ఉంటామని చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఆ దంపతులు జీవిత చరమాంకంలో కలిసే తనువు చాలించిన ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్న రామచెర్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామ్రెడ్డి, లక్ష్మి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఏమి చేయాలో తోచక అర్ధరాత్రి ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న బచ్చన్నపేట ఎస్త్స్ర హమిద్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.