calender_icon.png 10 October, 2025 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోటికాడి ముద్ద గుంజుకున్నరు!

10-10-2025 01:21:36 AM

బీసీ బిల్లుకు బీజేపీ, బీఆర్‌ఎస్ అడ్డం

  1. చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారు 
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపాటు
  3. కాంగ్రెస్ పార్టీ కోర్టులను, చట్టాలను నమ్ముతుంది
  4. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 
  5. బీసీ బిల్లుకు బీజేపీ, బీఆర్‌ఎస్ అడ్డం 

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి బీసీల నోటికాడి ముద్దను లాక్కున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన బిల్లును ఆపింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. గురువారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పార్టీ నేతలతో కలిసి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.

తాము చేసిన బిల్లులను బీజేపీ ప్రభుత్వం ఆడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకులకు రిజర్వేషన్ ఇవ్వాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేయలేదన్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్, బీజేపీలు తమపై నిందలు వేస్తున్నాయని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మీరా మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది అని నిలదీశారు. బీసీ బిల్లును అడ్డుకున్న వారికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని భట్టి హెచ్చరించారు.

“ఎంపిరికల్ డాటా లేకుండా రిజర్వేషన్ ఎలా ఇస్తారు? అని గతంలో కోర్టు చెప్పింది. అందుకే మా ప్రభుత్వం సైంటిఫిక్‌గా, ఎలాంటి పొరపాటు జరగకుండా సర్వే చేసి వాటిని బిల్లు రూపంలోకి తెచ్చాం. శాసనసభలో పెట్టిన   బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది. గవర్నర్ బిల్లుపై మూడు నెలలు అయినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే అది చట్టంగా మారినట్టే. 42 శాతం రిజర్వేషన్ కోసం మేము ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు బీఆర్‌ఎస్, బీజేపీ ఎక్కడికి పోయినాయి.

ఇప్పుడేమో ఢిల్లీకి రావడానికి సిద్ధమని అంటున్నారు” అని భట్టి విక్రమార్క మండిపడ్డారు. సర్వే లో కూడా పాల్గొనని పార్టీలు ఇవాళ కోర్టు తీర్పుపై మాట్లాడుతున్నాయని, ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని వారిని క్షమించని పేర్కొన్నారు. న్యాయ స్థానాల్లో, రాజకీయంగా పోరాటం చేస్తామని చెప్పారు. 

బీసీ రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పనిచేశాం: మహేశ్‌కుమార్

కాంగ్రెస్ పార్టీ కోర్టులను, చట్టాలను నమ్ముతుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇచ్చిందని, కోర్టు తీర్పు డాక్యుమెంట్ కాపీలు వచ్చిన తరువాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. “మేము బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి చిత్తశుద్ధితో అనేక కార్యక్రమాలు చేశాం. బ్రిటిష్ కాలంలో చేసిన కుల సర్వే తర్వాత దేశంలో మొదటిసారి చరిత్రలో శాస్త్రీయంగా కుల సర్వే జరిగింది.

దాని ఆధారంగానే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కృతనిశ్చయంతో పని చేస్తున్నాం. 50 శాతం పరిమితి పెడుతూ చట్టం చేసిన బీఆర్‌ఎస్.. అడుగడుగున బీసీలను అణగదొక్కింది. మేము కోర్టులో పోరాటం చేస్తుంటే బీజేపీ, బీఆర్‌ఎస్ ఎందుకు ఇంప్లీడ్ కాలేదు” అని అని మహేశ్‌కుమార్ మండిపడ్డారు.

బీసీలకు వ్యతిరేకంగా ఉన్న మీరు చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ నాయకులు ఢిల్లీలో ధర్నా చేశామని, అప్పుడు బీఆర్‌ఎస్, బీజేపీలు ఎందుకు రాలేదని ఆయన నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు.  

* ఎన్నికలు వాయిదా వేస్తూ హైకోర్టు స్టే ఇవ్వడం అన్యాయం. మా ఐక్యతను తక్కువ అంచనా వేయొద్దు. బీసీలకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి తదుపరి చర్యలు ప్రకటించాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించని పక్షంలో రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తాం. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. దీనికి భారీ మూల్యం చెల్లిస్తారు. 

 బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య

* బీసీలను ఈ దేశంలో బతకనివ్వరా?.. బీసీ బిల్లును అడ్డుకోవడం దుర్మార్గం. బీజేపీ, బీఆర్‌ఎస్ బీసీలను అణగదొక్కుతున్నాయి.

 కాంగ్రెస్ నాయకుడు వీహెచ్

* రాష్ర్ట ప్రభుత్వ మోసం తేటతెల్లమైంది. రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ఇంతకాలం చేసిందంతా డ్రామానే. స్థానిక ఎన్నికలను వివాదంగా మార్చి, ఏదో రకంగా వాయిదా వేయించేందుకు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పావుగా వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి తోడు, బీజేపీ కూడా బీసీ బిల్లుపై దారుణంగా వెన్నుపోటు పొడిచింది.

 బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

* రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ దురవస్థ. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి ఉన్న మూడు నెలల గడువు ముగియకముందే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికైనా సుప్రీం కోర్టును ఆశ్రయించాలి.

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

* హైకోర్టు తీర్పుపై బీసీ బిడ్డలు ఎవరూ అధైర్యపడవద్దు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదు. దీనిపై కార్యాచరణ తీసుకోబోతున్నాం. 

  మంత్రి వాకిటి శ్రీహరి

* హైకోర్టు స్టే ఇవ్వడం బీసీ వ్యతిరేక చర్య. నిరసనగా శుక్రవారం రాష్ర్టంలో ఎక్కడికక్కడ బీసీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి. బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలాడుతున్నాయి. ఒక పార్టీపై ఇంకొక పార్టీ నెట్టు వేసుకుంటూ బీసీలను బలి పశువులు చేశాయి. 

 బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్