calender_icon.png 27 July, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపేస్తామన్నారు

27-07-2025 12:14:45 AM

- ఈ విషయమై మాట్లాడేందుకు నా ఇంటికొచ్చిన సంగతి మరిచిపోయారా?

- నేను చెప్పేది నిజం కాదని గుండె మీద చేయేసుకొని చెప్పగలవా కేటీఆర్!

- అనవసరంగా నా జోలికొస్తే చాలా నిజాలు బయటకుచెప్తా

- కేటీఆర్‌కు బీజేపీ ఏపీ ఎంపీ సీఎం రమేశ్ కౌంటర్

హైదరాబాద్, జూలై 26: తెలంగాణలో కాంట్రాక్ట్ పనులపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా అనకాప ల్లి ఎంపీ సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘లిక్కర్ స్కామ్ కేసులో కవితపై విచారణ ఆపితే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామని అనలేదా? ఈ విషయంలో మా ట్లాడేందుకు మా ఇంటికి వచ్చిన విషయాన్ని అప్పుడే మర్చిపోయారా? కేటీఆర్ కోరిక మేరకే నేను బీజేపీ పెద్దలను కలిశా. బీఆర్‌ఎస్‌కు కాలం చెల్లిందని, ఆ పార్టీ తమకు అవస రం లేదు అని అన్నారు.. ఇది నిజం కాదని కేటీఆర్‌ను గుండెల మీద చేయి వేసుకొని చెప్పమనండి’ సీఎం రమేశ్ సవాల్ విసిరారు.

శనివారం ఆయన ఏపీలోని అనకాప ల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడు తూ.. టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు 300 ఓట్ల మెజార్టీతో సిరిసిల్లలో కేటీఆర్ ఏ విధం గా ఎమ్మెల్యేగా గెలిచారో చెప్పమంటావా అని పేర్కొన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకొని మా ట్లాడాలంటూ కేటీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలో పలు కంపెనీలు టెండర్లు వేశాయని, అందులో తనకు టెండర్లు రాలేదన్నారు. ఫ్యూచర్ సిటీలో వేసిన టెండర్లకు సంబంధించి అన్ని నిబంధనల ప్రకారమే రుత్విక్ కంపెనీకి టెండర్ వచ్చిందని స్పష్టతనిచ్చారు.

టెండర్ల విషయంలో వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. ఎవరితోనైనా స్నేహం చేస్తే టెండర్లు ఇస్తారా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ విలీనానికి బీజేపీ ఒప్పుకోలేదని కక్షగట్టి.. కేటీఆర్ తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేసినవన్నీ తనకు తెలుసనని, మాల్దీవులు, అమెరికా ఎలా వెళ్లారో.. అక్కడ ఏం చేశారో.. కూడా తెలుసని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని సీబీఐ, ఈడీకి సమర్పిస్తానని హెచ్చరించారు.

కవిత పోరుతో మతితప్పింది..

ఏపీలో వైసీపీ అధినేత జగన్‌కు తన సోదరి షర్మిలకు గొడవలు ఉన్నట్టే.. తెలంగాణలో చెల్లెలి పోరుతో కేటీఆర్‌కు మతిభ్రమించి మాట్లాడుతున్నారని సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ, టీడీపీ పొత్తు ఉంటుందని, అప్పుడు బీఆర్‌ఎస్‌కు పుట్టగతులు ఉండవని తెలిసి కేటీఆర్ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో సుమారు రూ.7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారన్నారు. అవి ఎవరెవరికి ఇచ్చారు? అందులో ఆంధ్రా వాళ్లు ఎంతమంది అన్నది తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. దమ్ముంటే వచ్చి మీడియా సమక్షంలో చర్చిద్దామని సవాలు విసిరారు. అనసవరంగా తనను గెలికితే చాలా నిజాలు బయటకు చెబుతానని హెచ్చరించారు.