27-07-2025 12:16:00 AM
రాజకీయాల్లో రకరకాల డిమాండ్లు తెరపైకి వస్తుంటాయి. ఆ డిమాండ్లు ఆయా సమయాలు, రాజకీయ సమీకరణాలు వంటి కారణాలతో హైలెట్ అవుతూ ఉంటాయి. సొంత పార్టీ నుంచి కాకుండా ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే డిమాండ్లు ప్రజల్లో కూడా చర్చకు దారితీస్తుంటాయి. అట్లాంటి ఓ రెండు డిమాండ్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇటీవల ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు.
అయితే ఖాళీ అయిన ఆ పోస్టు ఎవరికి దక్కుతుందో అనే చర్చ జరుగుతున్న క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి అనూహ్యంగా బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయకు ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. బీజేపీలో ఓబీసీలకు పదవులు ఇవ్వడం లేదని, దత్తాత్రేయకు ఈ ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే తెలంగాణ, ఓబీసీ వర్గాలకు ప్రాధాన్యం కల్పించినట్లు అవుతుందని తెలిపారు. మరోవైపు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఇటీవల తన శాఖలపై అసంతృప్తిని వ్యక్తం చేసినందున ఆయనకూ ప్రాధాన్యం కలిగిన శాఖ ఇవ్వాలని, రెవెన్యూ శాఖ ఇస్తే బీసీలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్‌కు సూచించారు. మొత్తానికి వీరి డిమాండ్లు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తమ్మనబోయిన వాసు