17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నిధులు మింగారు..పనులు మరిచారు!

31-05-2025 12:12 AM

-రూ.30 లక్షల నిధుల మాయాజాలం

-తూప్రాన్ 12వ వార్డులో అభివృద్ధి అస్తవ్యస్తం

-ధ్వంసమైన డ్రైనేజీలు, సిసి రోడ్లు

-పాత డ్రైనేజీలపై పైకప్పులతో సరిపెడుతున్న వైనం

-ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు

తూప్రాన్, మే 30 : మున్సిపాలిటీల అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో నిధులను మంజూరు చేశారు..ఆ నిధులతో డ్రైనేజీలు, మురుగు కాలువలు, సీసీ రోడ్ల అభివృద్ధికి వెచ్చించాలి.

మంజూరైన నిధులను మింగేసి...అభివృద్ధి పనులను మరిచిపోయారు. దీంతో వార్డులలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి..ధ్వంసమైన సీసీ రోడ్లమీదనే తిరగాల్సి వస్తోంది..తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు హైదరగూడలో పురాతన డ్రైనేజీలు ధ్వంసమై దుర్గంధం మధ్య కాలనీవాసులు జీవనం సాగిస్తున్నారు.

గతంలో ఈ వార్డులో మున్సిపాలిటీకి కేటాయించిన నిధుల నుండి రూ.30 లక్షలకు పైగా నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో సిసి రోడ్లకు, అండర్ డ్రైనేజీ కాలువలకు నిధులను వినియోగించాలని ప్రతిపాదనలు చేశారు. అయితే కాంట్రాక్టర్లతో పాలకులు కుమ్మక్కై నిధులను స్వాహా చేశారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. 12వ వార్డులో పాత డ్రైనేజీలను పునరుద్దరించి కొంతవాటిని నిర్మించాల్సి ఉండగా  పైపై పూత అన్న చందంగా పైకప్పు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఇలావుండగా 12వ వార్డులో గతంలో టిడిపి హాయంలో వేసిన డ్రైనేజీలు మాత్రమే కొనసాగుతున్నాయని, అవి పూర్తిగా ధ్వంసం అయ్యాయి. తూప్రాన్ గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో మాజీ సర్పంచ్ కమ్మరి సత్యనారాయణ, శివమ్మ లు వేసిన కాంక్రీటు డ్రైనేజీలను ఎంపిక చేసుకొని వాటిపైన బండలను పరిచి స్లాబ్ వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కాలనీ లోపల ఉన్న డ్రైనేజీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని వాటిని పూర్తిగా తొలగించి నూతన డ్రైనేజీలకు శ్రీకారం చుట్టాలని అంటున్నారు. మంజూరైన నిధులను అండర్ డ్రైనేజీ కాలువలకు, సీసీ రోడ్ల నిర్మాణాలకు ఉపయోగించాలన్నారు. లేనిపక్షంలో ఇప్పుడు వేస్తున్న పైకప్పును కాంట్రాక్టర్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల క్రితం 12వ వార్డు దుస్థితిపై తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డికి కాలనీవాసులు లేఖ సమర్పించారు. 

మంజూరైన నిధులు ఏమయ్యాయి..

12వ వార్డులో నూతన డ్రైనేజీకి, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తే అసలు పనులే జరగడం లేదు. పాత డ్రైనేజీలపై కప్పులు వేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మంజూరైన నిధులను సంబంధిత ప్రతినిధులు, అధికారులు అభివృద్ధికి వాడకుండా స్వాహా చేశారు. 

 గంగాధరి వెంకటేశ్, కాలనీవాసి

ఎన్నిసార్లు చెప్పినా పట్టింపులేదు...

భారీ వర్షాల కారణంగా డ్రైనేజీ పూర్తిగా నిండిపోయి నీరు ఇంట్లోకి ప్రవేశి స్తుంది. దీంతో రోగాల భారిన పడుతున్నాం.  పిల్లలకు వాంతులు, విరోచనాలు అవుతున్నాయి. చిన్న పిల్లలు ఎక్కడ ప్రమాదానికి గురవుతా రోనన్న భయంతో బతుకుతున్నాం. అధికారు లు స్పందించి డ్రైనేజీలను నిర్మించాలి. 

 సత్తమ్మ, కాలనీవాసి

చర్యలు తీసుకుంటాం..

12వ వార్డులో డ్రైనేజీలు, సీసీ రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యా యని కాలనీ మహిళలు, యువకులు గతంలో వినతిపత్రం సమర్పించారు. గతంలో నిధుల మంజూరు విషయం తనకు తెలియదని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులు ఇంకా మంజూరు కాలేదు. మళ్లీ నిధులు వస్తే మొదటి ప్రాధాన్యతగా 12వ వార్డుకు నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరిస్తాం.

 గణేష్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్