calender_icon.png 6 May, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది రాక్షస తాబేలు!

20-04-2025 12:00:00 AM

డైనోసార్ యుగంనాటి జీవిలా కనిపిస్తున్నది దీని పేరు ఎలిగేటర్ స్నాపింగ్ తాబేలు. మొసలికుండే పొలుసుల్లాంటి పెంకు కలిగి ఉండటం వల్లే దీనికి ఈ పేరు వచ్చింది. ఇది మంచినీటిలో జీవిస్తుంది. అమెరికాకు చెందిన జీవి. ఆ దేశంలోనే అతిపెద్ద మంచినీటి తాబేలు. దీని దవడలు కూడా చాలా బలంగా ఉంటాయి. ఈ లక్షణమే ఎలిగేటర్ స్నాపింగ్ తాబేలును అత్యంత ప్రమాదకరంగా మార్చింది.

ఇవి ఎక్కువగా ఫ్లోరిడా, టెక్సాస్, మిస్సోరి, ఇల్లినాయిస్, లూసియానాలో కనిపిస్తుంటాయి. 1937లో దాదాపు 187 కిలోల బరువున్న ఎలిగేటర్ స్నాపింగ్ తాబేలును గుర్తించారట. ఇప్పటి వరకు ఈ జాతిలో బరువు విషయంలో దీనిదే రికార్డు. చికాగోలో 113 కిలోలు, 107 కిలోలు, 135 కిలోలున్న వాటిని కనుగొన్నారు.

ఎలిగేటర్ స్నాపింగ్ తాబేళ్లు వాటి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. సర్వసాధారణంగా వీటి బరువు మాత్రం 21 కిలోల వరకు ఉంటుంది. ఇది పూర్తిగా మాంసాహార తాబేలు. చేపలు, ఇతర తాబేళ్లను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటుంది. కేవలం జలచరాలే కాకుండా కొన్నిసార్లు పక్షులు, ఎలుకలు, పాములు, ఇతర పురుగులనూ తినేస్తుంది. ఇది తన నోరును తెరిచి పెట్టి ఉంచి, నాలుకను కదిలిస్తూ ఉంటుంది. ఇవి పది నుంచి 50 వరకు గుడ్లను పెడతాయి.