20-07-2025 12:16:42 AM
పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగాసూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్‌రావు నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలతోపాటు పలు ఆసక్తికర విషయాలను చిత్ర సమర్పకుడు ఏఎం రత్నం తాజాగా పాత్రికేయులతో పంచుకున్నారు...
17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథ ఇది. బయట ప్రచారం జరుగుతున్నట్టు ఇది తెలంగాణ యోధుడు పండుగ సాయన్న నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లారు. హరిహర వీరమల్లు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే.. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు.. వీరిద్దరి కలయికతోపాటు వీరుడిని సూచించేలా వీరమల్లు అని పెట్టాం. నా సినీ జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా ఇదే. దానికి ఎన్నో కారణాలున్నాయి.
పవన్‌కల్యాణ్ డేట్స్ ఇచ్చినంత మాత్రాన వెంటనే పూర్తి చేయగలిగే సాధారణ చిత్రం కాదిది. అత్యంత భారీ చిత్రం. సెట్స్, గ్రాఫిక్స్‌తో ముడిపడిన చారిత్రక కథ. అందుకే ఆలస్యమైంది. నేను నిర్మించిన సినిమాల్లో 90 శాతానికిపైగా విజయం సాధించాయి. ఆ అనుభవంతో చెప్తున్నా.. ఇదీ బ్లాక్‌బస్టర్ చిత్రమే.
ఈ సినిమాను మొదట రెండు భాగాలుగా చేయాలని అనుకోలేదు. సినిమా అనేది వినోదంతోపాటు సందేశాన్ని అందించాల నేది నా భావన. నేను రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలు అలాగే ఉంటాయి. వీరమల్లు చారిత్రక నేపథ్యమున్న కథ. ఇలాంటి గొప్ప కథలో సందేశం ఉంటే.. ఎక్కువ మందికి చేరువ అవుతుందని భావించాం. అలా చర్చల్లో కథ స్పాన్ పెరిగింది.
‘ఖుషి’, ‘బంగారం’ తర్వాత పవన్‌కల్యాణ్‌తో చేసిన మూడో చిత్రమిది. పేరుకు మూడు సినిమాలే కానీ, మా మధ్య 25 ఏళ్ల అనుబంధం ఉంది. పవన్‌కల్యాణ్‌ను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. ఓ నటుడిగా కంటే కూడా మంచి ఆశయాలున్న మనిషిగా ఆయన నాకు ఎక్కువ ఇష్టం. సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ‘ఖుషి’ సమయంలో ఆయన ఆలోచన విధానం చూసి ఆశ్చర్యపోయాను.
అది ప్రేమకథా చిత్రం అయినప్పటికీ.. ఓ సన్నివేశంలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలా లజపత్ రాయ్ వంటి గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పారు. ఒక పాటలో దేశభక్తిని చాటుకున్నారు. సినిమాల్లో చూపించే ఇలాంటి విషయాలు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తాయి.
పవన్‌కల్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టు ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. దాన్ని మేము బాధ్యతగా భావించి, శ్రద్ధగా సినిమాను రూపొందించాం. పవన్‌కల్యాణ్ గౌరవానికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. పవన్‌కల్యాణ్ సహకారం లేకుండా ఇంత భారీ చిత్రాన్ని రూపొందించడం సాధ్యం కాదు. మేకర్‌గా నన్ను గౌరవిస్తారు. ఆయన పూర్తి సహకారం అందించారు కాబట్టే.. ఈ సినిమా ఇంత గొప్పగా తీయగలిగాం.
మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ, జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయా. మేమందరం చూడని ఓ కొత్త కోణంలో ఈ కథని చూశాడు. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా సినిమాను గొప్పగా మలిచాడు. సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఆలోచించాడు. జ్యోతికృష్ణ పనితీరు చూసి పవన్‌కల్యాణ్ కూడా ప్రశంసించారు.