21 August, 2026 | 2:41 AM

సూర్య నమ్మకాన్ని నిజం చేసిన సినిమా ఇది

21-08-2026 12:00 AM

తమిళ స్టార్ సూర్య హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ సినిమాకు నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, ఈ సినిమా ప్రయాణం వెనుక ఉన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకు మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ సూర్యకు చాలా నచ్చేసింది. అయితే, ఈ కథను నిజాయితీగా చెబుదామన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాం. విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య ఈ సినిమా చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు. 

వయసు వ్యత్యాసం ఉన్న బంధంపై కథ రాయాలని మొదట అనుకున్నా. 40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి బలమైన కారణం ఉండాలి. దాని చుట్టూ అల్లుకున్న కథ ఇది. నా దృష్టిలో మనుషులు చెడ్డవారు కాదు. పరిస్థితుల వల్ల ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. అదే విషయాన్ని సినిమాలో చెప్పాం. ఈ కథ నేను 2022లోనే అనుకున్నా. అప్పుడు సూర్యను దృష్టిలో ఉంచుకొని రాయలేదు. సూర్యకు నచ్చిన తర్వాత, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాం. 

సినిమాలో ఆర్ట్ వర్క్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇంటి సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిపై మేం కొంచెం హోంవర్క్ చేశాం. నేను, మా ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, డీవోపీ నిమిష్ ముగ్గురం కూర్చొని చర్చించుకున్నాం. ఇల్లు అనగానే విశాలంగానే కాదు, కొత్తగా ఉండాలనుకున్నాం. రిచ్‌నెస్ కనిపిస్తూనే, కొత్తదనం కనిపించాలి అనుకున్నాం. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందే సినిమాల నిర్మాణంలో త్రివిక్రమ్ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, దాదాపు అన్ని సినిమాలు చూస్తుంటారు. అయితే, త్రివిక్రమ్ సినిమా చూసిన తర్వాత చిన్నచిన్న మార్పులు చేర్పులు సూచిస్తూ ఉంటారు. కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం.. ఎలాంటి మార్పులు చెప్పకుండా, చాలా బాగుంది అన్నారు. 

నా దృష్టిలో ఏ సినిమా అయినా ఎడిట్ టేబుల్ మీద బెటర్ అవుతుంది. మనం తీసిన ప్రతిదీ సినిమాలో ఉండాలి అనుకోకుండా, ఎడిటర్‌కు స్వేచ్ఛ ఇస్తే.. ఖచ్చితంగా మంచి అవుట్ పుట్ వస్తుంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో అదే జరిగింది. 

సూర్య మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను తమిళంలో చిత్రీకరించాం. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో థియేటర్ల సంఖ్య తక్కువ. టికెట్ ధరల్లోనూ వ్యత్యాసం ఉంది. అందుకే అక్కడ వసూళ్లు తక్కువ వచ్చాయనిపిస్తుంది. కానీ, మన దగ్గరతో పోలిస్తే అక్కడ లాంగ్ రన్ ఉంటుంది. ‘కరుప్పు’ విషయంలో అదే జరిగింది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా లాంగ్ రన్‌లో తమిళంలో భారీ వసూళ్లు సాధిస్తుంది. 

‘ప్రేమలు’ సినిమా చూసి ఈ పాత్రకు మమితా బైజు సరిపోతుందనిపించింది. ఆమెకు తమిళం మీద కూడా పట్టుంది. కామెడీ చేయాలంటే భాష మీద పట్టుండాలి. మమిత అదే విషయాన్ని రుజువు చేస్తూ, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. 

నాకు డబ్బు, అగ్రిమెంట్‌లకు అతీతమైన బంధం సితార బ్యానర్‌తో ఏర్పడింది. నన్ను నమ్మి అవకాశమిచ్చిన ఆ బ్యానర్‌లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. 

ఒకప్పుడు అన్ని రకాల జానర్ సినిమాలు వచ్చేవి. కానీ, కొన్నేళ్లుగా ఫ్యామిలీ సినిమాలు తగ్గిపోయాయి. అందుకే ఒక మంచి ఫ్యామిలీ సినిమా వస్తే, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.   

నేను సినీ పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి నింపినది మణిరత్నం, త్రివిక్రమ్. అలాంటిది త్రివిక్రమ్‌తో నన్ను పోల్చడం అనేది గౌరవంగా భావిస్తున్నా. దానిని నిలబెట్టుకోవడం కోసం మరింత బాధ్యతగా పనిచేస్తా. త్రివిక్రమ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా నాలో ఎంతో స్ఫూర్తి నింపింది. ఆ తరహా రచన రాయడానికి ఇష్టపడతా.