ఇది ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వం
రైతులను గాలికొదిలి... గాలి మోటార్లలో సీఎం, మంత్రులు
కోటా సాకుతో శనగలు, మక్కలు, జొన్నల కొనుగోళ్లు నిలిపివేత
మాజీ మంత్రి హరీశ్ రావు
సదాశివపేట, ఏప్రిల్ 13(విజయక్రాంతి): రాష్ట్రంలో రైతులను సమస్యలను గాలికి వదిలేసి.. సీఎం, మంత్రులు గాలిమోటార్లలో తి రుగుతున్నారని, కాంగ్రెస్ పాలకులు గల్లీకి తక్కువ..ఢిల్లీకి ఎక్కువలా ఉన్నారని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు.
సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లా సదాశివపేట రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేం ద్రాన్ని సందర్శించారు.కోటా అయిపోయిందంటూ కొనుగోళ్లు నిలిపివేయడంతో వా రం రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారులను నిలదీశారు. హరీశ్‌రావు వెంట ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భం గా మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ ఏటిగడ్డ సంఘం తదితర గ్రామాల రైతులు తమ శనగలు కొనడం లేదని మా దృష్టికి తీసుకురావడంతో ఇక్కడి డీసీఎంఎస్ సెంటర్‌కు వచ్చామన్నారు. రైతులను, నిర్వాహకులను అడిగితే కోటా అయి పోయిందని చెబుతున్నారని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోతోందన్నారు. ఇది ము మ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు.
సదాశివపేటలో కొత్తగా శనగలు కొనకపోగా, ఇప్పటికే కొన్న శనగలను కూ డా బిల్లులు రావడం లేదని, బస్తాలు ఖాళీ చేసి రైతులకే వెనక్కి ఇచ్చేస్తున్నారని చెప్పా రు. వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నామని మొగలయ్య లాంటి రైతులు కన్నీ రు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడికి పో యారని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 60 వేల క్వింటాళ్ల శనగలు రైతుల దగ్గర ఉన్నాయని, వెంటనే రూ.5870 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మక్కలు, కందులు, శనగలు, జొన్నలకు బోనస్ ఇవ్వడం లేదని, కనీసం సన్న వడ్లకైనా ఈ యాసంగిలో బోనస్ ఇస్తారా లేదా స్పష్టం చేయాలని, గత యాసంగి బోనస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రైతుల కష్టాల మీద సీఎం రివ్యూ చేయాలన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జొన్నలు, సన్ ఫ్లవర్, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోటా పేరుతో ఆగిపోయిన శనగల కొనుగోలును వెంటనే తిరిగి మొదలుపెట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.




