26 April, 2026 | 2:47 PM

బద్నాం చేసేవారికి బుద్ధి చెప్పాలి

03-12-2024 01:57 AM
  1. ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదే
  2. ఏడాది పాలనలో విద్య, వైద్యానికి ప్రాధాన్యం
  3. త్వరలో 563 గ్రూప్-1 అధికారుల పోస్టుల భర్తీ 
  4. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా ఆర్‌ఎంపీలు 
  5. నాడు జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు అమ్ముకున్నరు 
  6. సన్న వడ్లకు 500 బోనసే బాగుందంటున్న కౌలు రైతులు
  7. 9న సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం 
  8. 7,8,9న ట్యాంక్‌బండ్, సచివాలయం వద్ద తెలంగాణ కార్నివాల్
  9. తెలంగాణ ఆరోగ్య ఉత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

* పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ జయ జయహే తెలంగాణ పాటను జాతికి అంకితం చేయకపోవడం ద్రోహం కాదా?. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం వద్ద ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా రాలేదు. బుద్ధుని పక్కన తన విగ్రహాన్ని పెట్టుకోవాలని కేసీఆర్ చూసిండు... ఫాంహౌస్‌లో ఉన్న వారి బాధకు మందులేదు. ఏదైనా ఉంటే మంత్రి జూపల్లి శాఖకు చెందిన మందు ఇవ్వాల్సిందే.

 సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ ౨ (విజయక్రాంతి): ప్రభుత్వాన్ని బద్నాం చేసేవారికి కర్రుకాల్చి వాత పెట్టి బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తిచేశారు. సంక్రాంతి పండుగకు వచ్చే గంగిరెద్దుల్లా కొందరు స్థానిక సంస్థల ఎన్నికల కోసం వస్తున్నారని.. వారికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేనేలేదని విమర్శించారు.

11 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోదీ, పదేళ్లు అధికారం అనుభవించిన కేసీఆర్.. ఏనాడూ  అన్నదాతల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదేనని స్పష్టంచేశారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి..

213 అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించారు. 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారామెడికల్ కళాశాలలు, ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్‌ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. నూతనంగా నియామకమైన 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 24 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులకు నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ జయ జయహే తెలంగాణ పాటను జాతికి అంకితం చేయకపోవడం ద్రోహం కాదా? అని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం వద్ద ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా రాలేదని, బుద్ధుని పక్కన తన విగ్రహాన్ని పెట్టుకోవాలని కేసీఆర్ చూసిండని ఆరోపించారు. ౯న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు.  

వైద్యారోగ్యశాఖలో ఊహించని మార్పులు

తమ ఏడాది పాలనలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చామని సీఎం తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఊహించని విధంగా మార్పులు తీసుకువచ్చామని, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహ సమర్థంగా పనిచేస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలో ప్రజారోగ్య వ్యవస్థ మెరుగైందని స్పష్టంచేశారు.

ఏడాదిలో వైద్య ఆరోగ్య శాఖలో 14 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, ఇప్పటికే 7,750 మంది పారామెడికల్ సిబ్బందికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశామని గుర్తుచేశారు. కేసీఆర్ ఇంట్లో వాళ్లను ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేస్తే తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ చరిత్రలో ఏ రాష్ర్టం ఒకే ఏడాది 55 వేల ఉద్యోగాలు ఇవ్వలేదని.. తెలంగాణలో తాము చేసి చూపించామని స్పష్టంచేశారు. ఏడాదిలో రికార్డు స్థాయిలో రూ.835 కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ను ఇచ్చామని స్పష్టంచేశారు. 

డీఎస్సీ వాయిదా కోసం కృత్రిమ ఆందోళన 

డీఎస్సీ వాయిదా వేయాలని రాజకీయ ప్రేరేపిత కృత్రిమ ఆందోళన చేశారని, ఎవరు అడ్డుపడినా డీఎస్సీ నిర్వహించి 55 రోజుల్లో 11వేల మందికి నియామక పత్రాలు అందించామని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ యువత పట్ల తమ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని చెప్పారు. గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని కోర్టులకు వెళ్లినా న్యాయస్థానాలు సమర్థించలేదన్నారు.

2011 తర్వాత గ్రూప్ 1 పరీక్షలే నిర్వహించలేదన్నారు. 13 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ప్రశ్నా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారని విమర్శించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైైర్మన్ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 563 మంది గ్రూప్ 1 అధికారులు త్వరలోనే  తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారని తెలిపారు.

మూడున్నరేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను తెలంగాణ పబ్లిక్ సర్వీస్  కమిషన్ చైైర్మన్‌గా నియమించామని తెలిపారు. గత ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను మార్చి ఆర్‌ఎంపీ డాక్టర్లు, డిప్యూటీ తాసీల్దార్లను సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించారని విమర్శించారు.   

ఫాంహౌస్‌లో ఉన్న వారి బాధకు మందు లేదు 

సంక్రాంతి తర్వాత రైతు భరోసా కచ్చితంగా ఇచ్చి తీరుతామని సీఎం ధీమావ్యక్తంచేశారు. రుణమాఫీ, రైతుభరోసాతో కొంత మంది గుండెల్లో పిడుగులు పడుతున్నాయని అన్నారు. ఫాంహౌస్‌లో ఉన్న వారి బాధకు మందులేదని, ఏదైనా ఉంటే మంత్రి జూపల్లి శాఖకు చెందిన మందు ఇవ్వాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు. గత పాలకులు వరి వేసుకుంటే ఉరేనని అన్నారని..

కానీ, తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో రైతులు సన్నాలు పండించారని... వారికి రూ. 500 బోనస్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతులు 63 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లను పండించారని తెలిపారు. సన్నాలకు ఇస్తున్న బోనస్‌తో కౌలు రైతులు సంతోషంగా ఉన్నారని, ఇదే విషయాన్ని ఓ మహిళా కౌలు రైతు తనకు చెప్పిందని అన్నారు.

రైతుబంధు ఇస్తే భూమి యజమానికి పోతోందని.. కానీ, బోనస్ ఇస్తే సాగు చేసుకుంటున్న తమ లాంటివారికి ఉపయోగమని చెప్పిందన్నారు. ఎకరానికి రూ. 15 వేల చొప్పున ఏడాదికి రూ. 30వేలు వచ్చాయని ఆ ఆడబిడ్డ చెబితే మంచి బిర్యానీ తిన్నట్టు అయ్యిందని, సంతోషమేసిందని అన్నారు. వచ్చే పదేళ్లు తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని.. బోనస్ కొనసాగుతుందని రైతులకు మాట ఇస్తున్నట్టు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ ఏడాది విజయోత్సవాల సందర్భంగా ఈ నెల 7, 8, 9 తేదీల్లో ట్యాంక్‌బండ్, సచివాలయం పరిసరాల్లో తెలంగాణ కార్నివాల్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఏడాది విజయోత్సవాలకు ప్రజలు తరలిరావాలని కోరారు. వైభవంగా సాగే ఈ ఉత్సవాల్లో రాష్ట్ర సంస్కృతిని, వంటకాల రుచులను ఆస్వాదించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినాజెడ్ చాంగ్తూ, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, డీహెచ్ రవీందర్‌నాయక్, డీఎంఈ వాణీ తదితరులు పాల్గొన్నారు. 

వైద్యశాఖ నిధులు ఎప్పుడూ ఆపలేదు: డిప్యూటీ సీఎం భట్టి  

రాష్ర్టంలోని బడుగు, బలహీన, పేద, మధ్య తరగతి ప్రజల వైద్య అవసరాలు తీర్చడం కోసం ప్రజా ప్రభుత్వం కావాల్సిన నిధులను విడుదల చేస్తున్నదని.. ప్రజారోగ్యానికి సంబంధించి ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా నిధులు విడుదల చేశామని డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి పేదలకు వైద్యంపై భరోసా ఇస్తున్నామని చెప్పారు.  ప్రజాప్రభుత్వానికి విద్య, -వైద్యం రెండు కళ్లలాంటివని.. వాటికి అత్యధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన బీఆర్‌ఎస్ పాలకులు ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.  

6 గ్యారెంటీల్లో ముఖ్యమైంది నెరవేర్చాం : మంత్రి దామోదర 

తాము హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ముఖ్యమైన ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గతంలో ఆరోగ్యశ్రీలో 986 ప్రొసీజర్లు మాత్రమే ఉండేవని, వాటిని 1375 ప్రొసీజర్లకు పెంచుకుని.. రూ.485 కోట్లను అదనంగా ఖర్చుచేస్తున్నామని అన్నారు. 16 నర్సింగ్, 28 పారామెడికల్, 8 మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలో ప్రారంభించామని స్పష్టంచేశారు. త్వరలో రూ.2 వేల కోట్లతో 2 వేల పడకల ఉస్మానియా నూతన భవనం పనులు ప్రారంభిస్తామని తెలిపారు.  

ఆరోగ్య మంత్రి మున్నాభాయి ఎంబీబీఎస్ : మంత్రి పొన్నం 

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మున్నాభాయి ఎంబీబీఎస్ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చమత్కరించారు. ఎంతో కమిటెడ్‌గా ఆయన ప్రజలకు వైద్య సేవలు అందేలా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఉద్యోగ నియామక పత్రాలు పొందిన వైద్యులు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వం ఎంత చేసిన ప్రజలు సహకరించాలని... వ్యక్తిగతంగా ఆరోగ్య అలవాట్లు పాటించాలని కోరారు.